iDreamPost
android-app
ios-app

కరోనా కేసులు – బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా కేసులు – బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం

దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా వైరస్‌ వ్యాప్తి వేగం పుంజుకోవడంతో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో వైరస్‌ను నియంత్రించడానికి మళ్లీ లాక్‌డౌన్ వైపు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇవాళ (జులై 14) రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి,నియంత్రణ చర్యల గురించి జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో 15 రోజులపాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ వెల్లడించారు. రాష్ట్రంలో జులై 16 నుంచి జులై 31 వరకు పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలులో ఉంటుందని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది.నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌కు సంబంధించి విడుదల చేసిన గైడ్‌లైన్స్‌ ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఈ నెలాఖరు వరకు మూసివేస్తారు. ప్రార్థనా మందిరాలకు భక్తులను అనుమతించరు. కేవలం నిత్యావసర దుకాణాలను తెరిచి ఉంచుతారు. ఈ లాక్‌డౌన్ కాలంలో వ్యవసాయ, నిర్మాణ రంగ పనులకు అనుమతి ఉంటుంది. అలాగే అత్యవసర సేవలకు అనుమతి యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది.

కొంప ముంచిన బిజెపి ఎన్నికల సన్నాహక సమావేశం:

కేంద్ర ప్రభుత్వం జారీచేసిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాల ప్రకారం ఏ రాజకీయ పార్టీ సమావేశాలు నిర్వహించడానికి అనుమతి లేదు.కానీ త్వరలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన బిజెపి నిబంధనలను ఉల్లంఘించి తమ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించింది.అయితే ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో సుమారు 75 నేతలకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది.దీంతో మొత్తం 100 మంది నుంచి నమూనాలు సేకరించి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు పంపించినట్లు అధికారులు తెలిపారు. వైరస్ బారిన పడిన వారిలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేశ్ కుమార్,ఎమ్మెల్సీ రాధామోహన్ శర్మ వంటి పలువురు ముఖ్య నేతలు ఉన్నారు.

ఇదిలా ఉంటే నితీశ్‌ క్యాబినెట్‌లోని మరో మంత్రి కూడా కరోనా బారినపడ్డారు.సోమవారం వచ్చిన వైరస్ పరీక్ష ఫలితాలలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శైలేశ్ కుమార్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.కాగా ఇంతకుముందు వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి వినోద్ కుమార్ సింగ్‌కు కూడా కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పటి వరకు బీహార్‌లో 17,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 12,364 మంది కరోనా వైరస్ నుండి కోలుకొగా కరోనాను 134 మంది మృత్యువాత పడ్డారు.ప్రస్తుతం బీహార్‌లో 4,923 వైరస్ క్రియాశీలక కేసులు ఉన్నాయి.

నేటినుంచి బెంగళూరులో మళ్లీ లాక్‌డౌన్‌:

దేశంలోని మహానగరాలలో కరోనా వైరస్‌ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉంది.ఈ నేపథ్యంలో కర్ణాటకలో వైరస్‌ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 2738 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.దీంతో పరిస్థితిని సమీక్షించిన కర్ణాటక ప్రభుత్వం రాజధాని బెంగళూరుతో పాటు పలు జిల్లాలలో వారంపాటు పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఇవాళ (జులై 14) రాత్రి నుంచి నుంచి జులై 22వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే అత్యవసర సేవలు, కిరాణ దుకాణాలతోపాటు మరికొన్నింటికి లాక్‌డౌన్‌ నుంచి సడలింపు ఇచ్చినట్లు తెలిపారు.

నేటి వరకు రాష్ట్రంలో 41,581 పాజిటివ్ కేసులు నమోదు కాగా 757 మంది వైరస్ బారిన పడి మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులలో సుమారు 25వేల మంది చికిత్స పొందుతున్నారు.యాక్టివ్ కేసుల సంఖ్య సంఖ్య ఎక్కువగా ఉండడంతో వైద్యసేవలపై ఒత్తిడి పెరిగినట్లు రాష్ట్ర మంత్రులు తెలిపారు.