iDreamPost
android-app
ios-app

యమా సందడిగా మొదలైన బిగ్ బాస్ షో

  • Published Sep 06, 2020 | 3:57 PM Updated Updated Sep 06, 2020 | 3:57 PM
యమా సందడిగా మొదలైన బిగ్ బాస్ షో

టీవీ రియాలిటీ షో లవర్స్ ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 4 అంగరంగ వైభవంగా మొదలైంది. అంచనాలకు తగ్గట్టే చాలా ఖరీదైన ఇంటీరియర్స్ తో సెట్ చేసిన హౌస్ ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యాంకర్ గా నటిస్తున్న కింగ్ నాగార్జున ఎంట్రీని కూడా సూపర్బ్ గా ప్లాన్ చేశారు. పైనుంచి వస్తున్న సింహాసనంలో నాగ్ కిందకు దిగి తన బ్లాక్ బస్టర్ సినిమాల పాటలకు లైట్ గా స్టెప్స్ వేయడం ఈ షో ఉద్దేశానికి లింక్ అయ్యే సాంగ్స్ ని ప్లే చేయడం మంచి జోష్ తో సాగింది. అసలైన ఆకర్షణ మాత్రం నాగార్జున తండ్రి గెటప్ లో తనే డ్యూయల్ రోల్ చేసి ఆ వేషంలోనే హౌస్ ని పరిచయం చేయడం బాగా కుదిరింది.

ఇక పార్టిసిపెంట్స్ ని పరిచయం చేయడం రెగ్యులర్ స్టైల్ లోనే సాగింది. గత మూడు సీజన్లతో పోలిస్తే ఇదేమంత ప్రత్యేకంగా లేదు. ఒక్కొక్కరిని సూపర్ హిట్ సాంగ్స్ తో పిలవడం వాళ్ళకు సంబంధించిన ఏవిలు ప్లే చేయడం ఎప్పుడూ చేసే తరహాలోనే ఉన్నాయి. కొందరివి మాత్రం డిఫరెంట్ గా అనిపించాయి. లాస్య లాంటి వాళ్ళకు ఎమోషనల్ గా ఫ్యామిలీ తో మాట్లాడించడం లాంటివి బాగానే కుదిరాయి. అందరి ప్రత్యేకతను విడివిడిగా స్టేజి మీదే చూపించేలా ఏర్పాటు చేయడం కూడా వెరైటీగా ఉంది. ఇక పార్టిసిపెంట్స్ ఇవాళ ఉదయం నుంచి చక్కర్లు కొడుతున్న లిస్టులో వాళ్ళే దాదాపుగా ఉన్నారు. మొత్తం 16 కంటెస్టెంట్లను 15 వారాల పాటు హౌస్ లో ఉంచనున్నారు.

ఇక వాళ్ళు పరిచయమైన సీక్వెన్స్ లో చూసుకుంటే హీరొయిన్ మోనాల్ గుజ్జర్, దర్శకుడు సూర్య కిరణ్, యాంకర్ లాస్య, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం అభిజిత్, యాంకర్ జోర్దార్ సుజాత, దిల్ సే మెహబూబ్, టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి, యుట్యూబ్ దేత్తడి హారిక, సయ్యద్ సోహెల్, అరియానా గ్లోరి, అమ్మ రాజశేఖర్, నటి కరాటే కళ్యాణి, సింగర్ నోయల్, దివి, అఖిల్ సార్తాక్ అండ్ వన్ అండ్ ఓన్లీ లేట్ ఏజ్ లేడీ గంగవ్వ ఒక్కొకరుగా నాగ్ నుంచి గ్రాండ్ వెల్కంతో పాటు హౌస్ లో వాళ్ళతో ఓ బంధాన్ని ఏర్పరిచే గిఫ్ట్ బాక్స్ తో అడుగు పెట్టారు. లోపల చాలా టాస్కులు ఉండబోతున్నట్టుగా స్పిన్నింగ్ వీల్ లాంటివి సెట్ చేయడం బాగుంది. మధ్యలో ముసలి వేషంలో నాగ్ చేసిన అల్లరి బాగుంది. మొత్తానికి బిగ్ బాస్ షోని ప్రత్యేకంగా ఇష్టపడే వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే సభ్యులు ఉండబోతున్నారనే క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక రేపటి నుంచి అసలైన లైవ్ హంగామా షురు.