iDreamPost
android-app
ios-app

బిగ్‌బాస్‌.. వీడు చాలా వైల్డ్‌గా వున్నాడు బాస్

బిగ్‌బాస్‌.. వీడు చాలా వైల్డ్‌గా వున్నాడు బాస్

పిట్ట కొంచెం, కూత ఘనం.. అని అంటుంటాం. కుమార్‌ సాయి కూడా అంతేనేమో. బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో ఫస్ట్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ, నిజంగానే వైల్డ్‌గా జరిగింది. పలు సినిమాల్లో కమెడియన్‌గా కనిపించిన కుమార్‌ సాయి, స్టేజ్‌ మీద అదరగొట్టేశాడు తన ఆటిట్యూడ్‌తో. కింగ్‌ నాగార్జున యెదుట, ఏమాత్రం బెరుకు లేకుండా కనిపించడమే కాదు, ‘మూడు ఆశయాలతో వచ్చాను..’ అని చెప్పాడు, అందులో ఒకటి నాగార్జునని హీరోగా పెట్టి దర్శకుడిగా సినిమా చేయడం అట. ఇంకోటి, హౌస్‌ నుంచి బయటకు వెళ్ళేటప్పటికి కరోనా వ్యాక్సిన్‌ వచ్చేసి, ఎంచక్కా తన సినిమాల వర్క్‌ చేసుకోవాలనే ఆలోచన అట. మరొకటి, ఏకంగా టైటిల్‌ని గెల్చుకోవడమట. సినిమాల్లో చూడానికి చాలా అమాయకంగా వుంటాడుగానీ, బిగ్‌బాస్‌ స్టేజ్‌ మీద మాత్రం చిచ్చర పిడుగులా కనిపించాడు. హౌస్‌లోకి అర్థరాత్రి ఎంట్రీ ఇచ్చిన కుమార్‌ సాయి, టైటిల్‌ గెలవడం సంగతేమోగానీ, హౌస్‌లో మాత్రం రచ్చ రచ్చ చేసేలా వున్నాడు. ‘గొడవలు పెట్టడంలో దిట్ట’ అనే ఇంప్రెషన్‌ వేయించేసుకున్నాడు అప్పుడే కుమార్‌ సాయి తన ఆటిట్యూడ్‌ కారణంగా. క్వారంటైన్‌లో వున్న సమయంలోనే హౌస్‌లో ఏం జరుగుతుందో అంతా తెలుసుకున్నాడట. అది నిజంగానే ఓ అడ్వాంటేజ్‌. విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే, మనోడ్ని ‘నారదుడు’ పాత్ర కోసమే హౌస్‌లోకి నిర్వాహకులు పంపించారని. అదే నిజమైతే, హౌస్‌ దద్దరిల్లిపోతుందన్నమాట ఇకనుంచి.