iDreamPost
iDreamPost
ఎన్నడూ లేని తరహాలో బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ ఈసారి తమ పంట పండించుకుంటున్నారు. షో నడుస్తున్నంత కాలం సెలెబ్రిటీలు కాని వీరి పట్ల ప్రేక్షకుల స్పందన మిశ్రమంగానే ఉన్నప్పటికీ ఒక్కసారి ఫైనల్ ఎపిసోడ్ పూర్తి చేసుకుని బయటికి వచ్చాక అందరి జాతకాలు మారిపోతున్నాయి. తాజాగా మోనాల్ ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ ఛాన్స్ కొట్టేయడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న అల్లుడు అదుర్స్ లో హీరోతో పాటు ఓ గీతంలో ఆడిపాడబోతోంది. ఇప్పటికే దీని చిత్రీకరణ ప్రారంభమయ్యిందట. మోనాల్ కు ఇది ఎలా చూసుకున్నా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు.
తన డెబ్యూ సినిమాల్లోనే తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ని స్పెషల్ సాంగ్స్ కోసం తెచ్చుకున్న సాయి శ్రీనివాస్ తో మోనాల్ జట్టు కట్టడం పెద్ద మ్యాటర్ కాదు. అయితే పారితోషికం కూడా భారీ గానే ఉంటుంది. ఈ సంగతలా పక్కనపెడితే ఇటీవలే సొహైల్ హీరోగా ఓ సినిమా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. జార్జ్ రెడ్డి నిర్మాత కావడంతో బడ్జెట్ కూడా బాగానే పెట్టబోతున్నారు. అరియనా, అవినాష్ లు యాంకర్ లుగా ఓ రియాలిటీ షో ప్లానింగ్ జరుగుతున్నట్టుగా మరో అప్ డేట్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్లానింగ్ లో ఓ ఛానల్ బిజీగా ఉన్నట్టు తెలిసింది. అఖిల్ సార్థక్ కు సైతం ఆఫర్లు వస్తున్నాయి.
ఇక అసలు విన్నర్ అభిజిత్ కు మెగా బ్రదర్ నాగబాబు బహిరంగ మద్దతు ప్రకటించడం సోషల్ మీడియాలో చూశాం. ఇతనికి ఛాన్స్ ఇమ్మని ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాడు నాగబాబు. మరోవైపు మెహబూబ్ కు ఏదైనా చిన్న పాత్ర సెట్ చేయమని ఆచార్య దర్శకుడు కొరటాల శివకు చిరంజీవి ప్రత్యేకంగా చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. హారికను సైతం అవకాశాలు తలుపు తడుతున్నాయి. లాస్య ప్రస్తుతానికి యుట్యూబ్ ఛానల్ వేదికగా వీడియోలు చేసుకుంటూ మిలియన్ల వ్యూస్ అలవోకగా తెచ్చేసుకుంటోంది. ఇలా బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ అందరూ మాములుగా బిజీగా లేరు. మూడు సీజన్లతో పోలిస్తే ఇప్పటి సిరీస్ సభ్యులకే మంచి అవకాశాలు వస్తున్నాయి