iDreamPost
iDreamPost
నిన్న బిగ్ బాస్ 4లో అందరూ ఊహించినట్టే లీకుల ప్రకారమే జరిగింది. జబర్దస్త్ అవినాష్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ప్రవేశించాడు. వీక్ డేస్ రేటింగ్స్ ఆశించినంత స్థాయిలో రావడం లేదన్న రిపోర్ట్స్ తో ప్లాన్ చేసుకున్న దాని కన్నా ముందుగానే తీసుకొచ్చారట. ఇప్పుడు ఈ షోకు మంచి ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడం చాలా అవసరం. దేత్తడి హారిక, మెహబాబూబ్ లాంటి ఒకరిద్దరు తప్ప మిగిలినవాళ్లు అంతగా కిక్ ఇవ్వడం లేదు. జోర్దార్ సుజాతా, దేవి నాగవల్లి తమ టీవీ స్కిల్స్ ని వాడుతున్నప్పటికీ అవి అంతగా పండటం లేదు. అందుకే అవినాష్ అయితే జబర్దస్త్ మార్కు హాస్యంతో కాస్త మసాలా కోటింగ్ ఇస్తాడని నిర్వహకుల అంచనా.
అయితే ఇతని రాక వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దాని ప్రకారం జబర్దస్త్ షోలో పాల్గొనే ఎవరైనా సరే ఒక అగ్రిమెంట్ కు లోబడి అందులో ఉన్న గడువు వరకు ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ విత్ డ్రా చేసుకోవాల్సి వస్తే పది లక్షల రూపాయలు కట్టి బయటికి వచ్చేయొచ్చు. లీగల్ గానూ ఇది ముందే రాసుకుంటారు. కానీ బిగ్ బాస్ ఆఫర్ చాలా టెంప్టింగ్ గా ఉండటంతో పాటు వాళ్ళిచ్చే రెమ్యునరేషన్ లోనే మల్లెమాల సంస్థకు సులభంగా పది లక్షలు కట్టే వెసులుబాటు ఉండటంతో వెంటనే ఒప్పేసుకున్నాడట. ఇది గాసిప్పో లేక నిజమో చెప్పలేం కానీ టాక్ అయితే మహా జోరుగా ఉంది. ఈ లెక్కన చూసుకుంటే అవినాష్ ఎక్కువ వారాలు హౌస్ లో ఉండటం ఖాయమైనట్టే,
అలా ఉంటే తప్ప తనకు గిట్టుబాటు కాదు. షోలో ఎక్కడెక్కడ ఏ టైంలో గేమ్ లో ఊపు తేవాలన్నది ముందుగానే అతగాడు ఓ ప్లాన్ తో ఉన్నాడట. అదే కనక వర్కౌట్ అయితే రచ్చ ఓ రేంజ్ లో ఉండటం ఖాయం. అసలే రేపటి నుంచి ఐపిఎల్ గండం ఉంది. దాని వైపు ప్రేక్షకులను వెళ్లకుండా ఆపడం అంత సులభం కాదు. అందులోనూ మగ ఆడియన్స్ ని కట్టడి చేయడం అసాధ్యమే. సో బిగ్ బాస్ షోకి ఇప్పుడు లేడీస్ అండ ఎంతో కీలకం. వాళ్ళను ఆకట్టుకుంటే చాలు రిమోట్ కంట్రోల్ సేఫ్ గా స్టార్ మా వైపే ఉంటుంది. అందుకే అవినాష్ లాంటి ఎంట్రీస్ ని త్వరగా తెచ్చేశారు. ఓపెనింగ్ ఎపిసోడ్ రేటింగ్లో కొత్త రికార్డు నెలకొల్పిన బిగ్ బాస్ మిగిలిన రోజుల్లో సగటున అందులో సగం కంటే తక్కువే సాధిస్తోంది. దీన్ని పెంచాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా 80 రోజులకు పైగా గేమ్ మిగిలి ఉంది కాబట్టి ఇప్పుడున్న హంగామా సరిపోదు. రెట్టింపు చేయాల్సిందే