తమిళనాడు, బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలతో కలిసి పుదుచ్ఛేరిలో కూడా మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పదవీ కాలం ముగియడంతో ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. త్వరలో జరిగే ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం (17వ తేదీన) పుదుచ్చేరి వెళ్లబోతున్నారు. ఈలోగా అక్కడ రాజీనామాల పర్వం ఊపందుకోవడంతో కుంది. దక్షిణాదిలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్న ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో సీఎం హడావిడిగా కేబినెట్ మీటింగ్ పెట్టి సమాలోచనలు చేస్తున్నారు.
పుదుచ్చేరి అసెంబ్లీ లో శాసనసభ్యుల సంఖ్య 33 మంది. వారిలో ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 30 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 15 సీట్లను, భాగస్వామ పక్షం డీఎంకే 2 సీట్లను గెలుచుకున్నాయి. మొత్తం 17 సీట్ల మెజార్టీతో కాంగ్రెస్ అధికార పీఠం చేజిక్కించుకుంది. అప్పట్నించి నారాయణ స్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పార్టీ బలం మెజారిటీ మార్కుకు దిగువన చేరింది. నమశివాయం, తిప్పయింజన్ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు జనవరి 25న రాజీనామా చేయగా.. మిగితా ఇద్దరిలో ఒకరు సోమవారం రాత్రి యానాం శాసనసభ్యుడు, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు రాజీనామా చేశారు. తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 16న) కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్ కుమార్ రాజీనామా చేశారు.
ముఖ్యమంత్రి నారాయణస్వామికి సన్నిహితుడైన జాన్ కుమార్ 2019లో కామరాజ్ నగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో గెలిచారు. ఇప్పటివరకు రాజీనామా చేసిన వారిలో జాన్ కుమార్ నాలుగోవారు. 33 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో మూడు నామినేటెడ్ స్థానాలు. వాటిలో కాంగ్రెస్ కు పొత్తు పార్టీతో కలిపి 17 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు నలుగురు రాజీనామా చేయడంతో ప్రభుత్వ బలం 13కి చేరింది. దాంతో పుదుచ్చేరి రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి.
ఏపీ సముద్ర తీరంలో వుండే యానాం నుంచి దాదాపు పాతికేళ్ళుగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లాడి కృష్ణారావు జనవరి 7న మంత్రి పదవికి రాజీనామా చేశారు. దానిని ముఖ్యమంత్రి ఇంకా ఆమోదించకముందే సోమవారం నాడు తన శాసనసభ్యత్వానికి కూడా మల్లాడి రాజీనామా లేఖను సమర్పించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పుదుచ్చేరి శాసన సభాపతి వీపీ శివకొలుందుకు పంపారు. నిజానికి జనవరి ఆరవ తేదీన మల్లాడి కృష్ణారావు ఉత్తమ శాసనసభ్యునిగా రజతోత్సవ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ మర్నాడే అంటే జనవరి 7వ తేదీనే జనవరి 7న ఆరోగ్య శాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తూ సంబంధిత పత్రాలను సీఎంకు అందజేశారు. ఇంతవరకు ఆ రాజీనామాకు సీఎం ఆమోదం తెలపలేదు. ఈ నేపథ్యంలో తన శాసన సభ్యత్వానికి సైతం రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ పరిణామాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే మైనార్టీలో పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీనామాల పర్వం ఇంకా కొనసాగితే.. ప్రతిపక్షం విశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు ఉన్నాయి. విశ్వాస పరీక్షలో ప్రభుత్వం తన బలం నిరూపించుకోలేక పోతే కేంద్ర పాలన అమల్లోకి రావచ్చు. అదే జరిగితే ప్రస్తుతం అక్కడ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.