iDreamPost
android-app
ios-app

అర్నాబ్ జోరుకు బ్రేక్…శశి థరూర్ కు ఊరట

అర్నాబ్ జోరుకు బ్రేక్…శశి థరూర్ కు ఊరట

రిపబ్లిక్ ఛానల్ ఎండీ, ఎడిటర్ అర్నాబ్ గోస్వామి జోరుకు ఢిల్లీ హైకోర్టు అడ్డుకట్ట వేసింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేసులో సంయమనం పాటించాలని కోర్ట్ ఆదేశించింది.

సాంప్రదాయ పద్దతిలో సాగుతున్న మీడియా పంధాను కొత్త పుంతలు తొక్కించిన ఘనత అర్నాబ్ గోస్వామిది. ‘నేషన్ వాంట్స్ టూ నో’ అంటూ ఆయన చేసే కార్యక్రమానికి మంచి ఆదరణ ఉంది. తన ఉద్దేశాలను మాత్రమే చెబుతూ ఇతరులకు అవకాశమివ్వరూ అంటూ విమర్శలు వచ్చినా అర్నాబ్ మీడియా రంగంలో ఓ ట్రెండ్ సృష్టించారు. బీజేపీ ఎంపీతో కలిసి రిపబ్లిక్ ఛానల్ ఏర్పాటు చేసిన అర్నాబ్ తమ ప్రసారాలలో కాంగ్రెస్ పార్టీని ఏకిపారేస్తుంటారనే సంగతి తెలిసిందే. తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని దీని వెనుక ఆ పార్టీ పెద్దల హస్తం ఉందంటూ కేసులు కూడా నమోదు చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేసు విచారణ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇంకేముంది తన స్టైల్ లో ఈ కేసును అర్నాబ్ తమ ఛానల్ నుంచే విచారణ జరిపి నిందితులు ఎవరో చెప్పేశారు. ఇంకో అడుగు ముందుకేసి ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారు అత్యున్నత స్థానాలలో ఉండరాదని సలహా ఇచ్చారు.

హైకోర్ట్ లో పిటీషన్ వేసిన శశి థరూర్

అర్నాబ్ గోస్వామిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే గాకుండా హైకోర్టులో కేసు దాఖలు చేశారు. థరూర్ సతీమణి సునందా పుష్కర్ కొన్ని రోజుల కిందట అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై గత కొని రోజులుగా కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సమయంలో సునంద పుష్కర్ కు సంబందించిన రహస్యాలను అర్నాబ్ తమ ఛానల్ లో ప్రసారం చేశారని థరూర్ పీటీషన్ దాఖలు చేశారు. టీఆర్పీల కోసం తమ కుటుంబాలను రోడ్డు కు ఈడ్చారంటూ థరూర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన సతీమణిని అవమానపరుస్తూ రిపబ్లిక్ ఛానలో వరుస కథనాలు వచ్చాయని థరూర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

హైకోర్టు ఆదేశాలు

థరూర్ పిటీషన్ ను విచారించిన జస్టిస్ ముక్తా గుప్తా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో మీడియా సమాంతర విచారణ జరపరాదని ఆదేశించింది. కేసు కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో మీడియా తమ కోణాన్ని చూపే ప్రయత్నం చేయరాదని హెచ్చరించింది. థరూర్ కేసు విచారణ ముగిసే వరకు ఎటువంటి వక్ర భాష్యాలతో కథనాలు ప్రసారం చేయరాదని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.