iDreamPost
android-app
ios-app

బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్..

బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్..

అందరూ ఊహించినట్లుగానే బిగ్‌బాస్ 4వ సీజన్ విజేతగా అభిజిత్ నిలిచాడు. 105 రో జులపాటు సాగిన ఈ షో గ్రాండ్ ఫినాలే ఆదివారం జరగగా పలువురు సినీ తారలు ప్రణీత, లక్ష్మీరాయ్, మెహ్రీన్, దర్శకుడు అనిల్‌ రావిపూడి హాజరు కాగా చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావడం విశేషం. సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్‌ కాన్సర్ట్‌తో అలరించారు.

కాగా మొదటినుంచీ బిగ్‌బాస్ ఇంటిలో తనదైన ఆట తీరు,నేర్పుతో అభిజిత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో అభిజిత్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రతీ ఎపిసోడ్‌లో పరిపక్వతతో కూడిన గేమ్ ఆడిన అభిజిత్ కే తెలుగు ప్రేక్షకులు పట్టం కట్టారు..

మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఈ షోలో పాల్గొనగా కుమార్‌ సాయి,అవినాశ్‌, స్వాతి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా లోపలికి వెళ్లారు. దాంతో 19 మంది కంటెస్టెంట్లు అయ్యారు.. వారిలో వారానికి ఒకరు చొప్పున ఎలిమినేట్‌ అవుతూ రాగా గ్రాండ్ ఫైనాలేలో అఖిల్, అభిజిత్, సొహెల్, హారిక, అరియానాలు టాప్‌–5 ఫైనల్‌ కంటెస్టెంట్స్‌గా మిగిలారు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న గంగవ్వ,నోయల్ మధ్యలోనే అనారోగ్య కారణాలతో బిగ్‌బాస్ ఇంటిని వీడటం కూడా అభిజిత్ కి కలిసొచ్చిందని చెప్పొచ్చు.

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో ముందుగా హారిక, అరియానా ఎలిమినేట్ అయ్యారు. తర్వాత హౌస్‌లో మిగిలిన అభిజీత్‌, అఖిల్‌, సొహైల్‌కు నాగార్జున ఓ ఆఫర్‌ ఇచ్చారు. ఎవరైతే స్వచ్ఛందంగా బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వస్తారో వారికి రూ.25 లక్షలు ఇస్తానని ప్రకటించడంతో సోహైల్ ఆ 25 లక్షలు తీసుకుని వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాడు. ఆ 25 లక్షల్లో 10 లక్షలు అనాథ శరణాలయానికి మరో ఐదు లక్షలు తన స్నేహితుడు మెహబూబ్‌కు ఇస్తానని సోహైల్ చెప్పడంతో తనకి ఇస్తానన్న 5 లక్షలు కూడా అనాథ శరణాలయానికి ఇస్తానని చెప్పడంతో నాగార్జున ఆ పది లక్షలు నేనే అనాథ శరణాలయానికి ఇస్తానని 25 లక్షలను సోహైల్ కే దక్కుతాయని ప్రకటించడంతో ప్రేక్షకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.. మెహబూబ్‌ అనాథ శరణాలయానికి ఐదు లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవికి చెప్పడంతో చిరంజీవి పది లక్షల చెక్కును అప్పటికప్పుడు మెహబూబ్‌కు అందించడం విశేషంగా చెప్పుకోవచ్చు..

కాగా గ్రాండ్ ఫినాలేలో అభిజిత్,అఖిల్ మధ్య పోటీ నెలకొంది. కానీ ఎక్కువ ఓట్లు ఏకపక్షంగా అభిజిత్ కే దక్కడంతో బిగ్‌బాస్ విన్నర్ గా అభిజిత్ ను ప్రకటించారు. గ్రాండ్‌ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా అభిజత్‌ బిగ్‌బాస్‌–4 ట్రోఫీ అందుకున్నాడు. గత బిగ్‌బాస్‌ సీజన్‌–3కు 8 కోట్ల మంది ప్రేక్షకులు ఓటు వేయగా 4వ సీజన్‌లో మాత్రం 15 కోట్ల 65 లక్షల ఓట్లు వచ్చాయని నాగార్జున ప్రకటించారు.