iDreamPost
android-app
ios-app

బాబు ప్రభుత్వంలో సైకిళ్ల స్కామ్, పేమెంట్ నిలిపేసిన జగన్ సర్కారు

  • Published Jul 15, 2020 | 5:03 AM Updated Updated Jul 15, 2020 | 5:03 AM
బాబు ప్రభుత్వంలో సైకిళ్ల స్కామ్, పేమెంట్ నిలిపేసిన జగన్ సర్కారు

చంద్రబాబు పాలనలో అవినీతి పెచ్చరిల్లిందనే విషయంలో ప్రజల్లో దృఢమైన అభిప్రాయం ఉంది. దానికి తగ్గట్టుగానే తాజాగా పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా టీడీపీ ఎన్నికల గుర్తు సైకిళ్ల పేరుతో సాగించిన దందా ఒకటి బయటపడింది. ఇప్పటికే కార్మికుల ఆరోగ్యానికి సంబంధించిన ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రిమాండ్ లో ఉన్నారు. అదే పరంపరలో మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారం కూడా మారుతుందా అనే చర్చ మొదలయ్యింది.

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సైకిళ్ల కొనుగోళ్ళు కోసం 12 కోట్లు వెచ్చించింది. నిబంధనల ప్రకారం వాటి విలువ రూ. 5 కోట్లు కూడా ఉండదనే వాదన ఉంది. పలువురు నేతలు ఈ విషయంపై ప్రభుత్వానికి ఆధారాలు సమర్పించారు. అక్రమంగా 12 కోట్ల కొనుగోళ్లలోనే రూ. 5 కోట్లు కాజేయాలనే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. దాంతో అప్రమత్తమయిన జగన్ సర్కారు దానికి అనుగుణంగా స్పందించింది. ఆ సైకిళ్ల కొనుగోళ్ల వ్యవహారంలో చెల్లింపులు నిలిపివేయాలని ఆదేశించింది. దానికి తగ్గట్టుగా నిర్ణయం అమలులోకి రావడంతో ఇప్పుడు సైకిళ్ల కొనుగోళ్ల వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ అవసరమనే అభిప్రాయం వినిపిస్తోంది.

విజిలెన్స్ లేదా ఇప్పటికే వివిధ అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సిట్ తో కూడా విచారణ సాగిస్తే ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. నాటి విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు పాత్ర మీద కూడా సందేహాలు వినిపిస్తున్న తరుణంలో సమగ్ర చర్యలు అవసరమని అంటున్నారు. దాంతో జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందోననే ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రభుత్వం దూకుడు పెంచితే గంటాకి చిక్కులు ఖాయమనే అభిప్రాయం ఉంది.

ఇప్పటికే ఇలాంటి విషయంలో గుజరాత్ ప్రభుత్వానికి అక్కడి హైకోర్ట్ ఝలక్ ఇచ్చింది. 2018లో జరిగిన వ్యవహారంలో అక్కడి కోర్ట్ పెనాల్టీ కూడా విధించింది. గుజరాత్ ప్రభుత్వ సంస్థ గ్రిమ్కో ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన 2.5లక్షల సైకిళ్ల కొనుగోళ్లలో నాసిరకం సైకిళ్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. 2,700 ఖరీదు చేసే సైకిల్ ని రూ.3495 చొప్పున కొనుగోలు చేసిన వ్యవహారంలో అక్రమాలపై దాఖలయిన పిల్ ఆధారంగా పెనాల్టీ విధించారు.

అదే సమయంలో ఎస్ కే బైక్స్ కంపెనీని బ్లాక్ లిస్టులో కూడా పెట్టారు. ఆ సంస్థ నిబందనలు పాటించకపోవడం, సకాలంలో నాణ్యత ప్రకారం సైకిళ్లు సరఫరా చేయడంలో విఫలమయ్యిందని ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం అదే కంపెనీ నుంచి సైకిళ్లను కొనుగోలు చేసిన తీరు మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గంటా పాత్ర మీద ఆరోపణలు వస్తున్నాయి. దాంతో టీడీపీ కి ఇప్పుడు సైకిల్ పెద్ద చిక్కులు తెచ్చిపెట్టే పరిస్థితి ఉందని చెబుతున్నారు.