ఆయన ఒక పెద్ద రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించారు. ఒక్కసారి కాదు మూడుసార్లు సీఎం పీఠం అధిష్టించారు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లు. ఆ లెక్కన ఆయన మూడుసార్లు పదవి చేపట్టారంటే 15 ఏళ్లు సీఎంగా ఉన్నారని అనుకోవడం సహజం. కానీ ఆయన ఆ మూడు దఫాలు కలిపి 11 నెలలే పదవిలో ఉన్నారు.. పాలన సాగించారు. అప్పటి రాజకీయ పరిణామాల్లో స్వల్ప కాలమే సీఎం పదవిలో ఉన్నప్పటికీ.. దళితుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహనీయుడిగా పేరుపొందిన భోలా పాశ్వాన్ శాస్త్రి తనకంటూ పైసా ఆస్తి కూడా సంపాదించులేదు.
విజ్ఞాన సంపన్నుడు
బీహార్ రాష్ట్రం పూర్ణియా జిల్లాలోని బైర్గాచి గ్రామంలో 1914 సెప్టెంబర్ 21న జన్మించిన భోలా పాశ్వాన్ ఎస్సీ సామాజికవర్గంలోని జాతవ్ కులానికి చెందిన వారు. వీరిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు రోజు కూలికి వెళ్లేవారు. అయినా భోలా పాశ్వాన్ చదువుపై జిజ్ఞాసతో కాశీ విద్యాలయానికి వెళ్లి ఉన్నత విద్య అభ్యసించారు. అపారమైన విజ్ఞానం సముపార్జించినందునే ఆయన పేరు చివర శాస్త్రి అన్న బిరుదు చేరింది. స్వాతంత్ర్య సమరంలో కూడా పాల్గొన్న ఆయన కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు.
Also Read : ముఖ్యమంత్రులతో జాతీయ పార్టీల బంతులాట
కష్టకాలంలో సీఎం పదవి..
కాంగ్రెసులో కింది స్థాయి నుంచి ఎదిగిన భోలా పాశ్వాన్ 1968లో తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అనుకోకుండా అధిరోహించారు. బీహార్ కు తొలి దళిత సీఎంగా చరిత్ర సృష్టించారు. 1967లో జరిగిన బీహార్ నాలుగో అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది తిరక్కుండానే మైనారిటీలో పడిన పరిస్థితుల్లో 1968 మార్చి 22న భోలా పాశ్వాన్ సీఎం పదవి చేపట్టారు. అయితే 1968 జూన్ 29న ఆ ప్రభుత్వం కూలిపోయింది. దాంతో వంద రోజుల్లోనే పాశ్వాన్ పదవీకాలం ముగిసింది. 1968లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గెలవగా హరిహర్ సింగ్ సీఎం పదవి చేపట్టారు.
అయితే 1969 జూన్ లో కాంగ్రెసు పార్టీలో ఏర్పడిన చీలిక ఆ ప్రభుత్వం కూలిపోవడానికి దారి తీసింది. దాంతో కాంగ్రెస్ (ఓఆర్జీ) పేరుతో చీలిక వర్గానికి నాయకత్వం వహించిన పాశ్వాన్ మరికొందరితో కలిసి 1969 జూన్ 22న తాను సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేక 13 రోజుల్లోనే.. 1969 జూలై 4న పాశ్వాన్ ప్రభుత్వం కూలిపోయింది. 1971 జూన్లో కాంగ్రెసులోకి తిరిగివచ్చిన భోలా పాశ్వాన్ 1971 జూన్ రెండో తేదీన ముచ్చటగా మూడోసారి సీఎం పదవి చేపట్టారు. ఈసారి ఏడు నెలలు పదవిలో ఉన్న ఆయన పార్టీలో అంతర్గత కలహాలు కారణంగా 1972 జనవరి 9న రాజీనామా చేశారు. కాగా 1972 నుంచి 1982 వరకు పదేళ్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పాశ్వాన్ 1984 సెప్టెంబర్ పదో తేదీన కన్ను మూశారు.
Also Rea : సీఎంలను మారిస్తే ఎన్నికల్లో గెలుస్తారా?గతంలో గెలిచారా?
కష్టాల్లో జీవిత చరమాంకం..
చిన్న పదవి వస్తే చాలు కోట్ల ఆస్తులు కూడబెట్టే నాయకులను మనం చూస్తున్నాం. అలాంటిది స్వల్ప కాలమే అయినా సీఎం వంటి అత్యున్నత పదవిని మూడుసార్లు అధిష్టించిన భోలా పాశ్వాన్ తనకంటూ ఒక పైసా అయినా వెనకేసుకోలేదు. తన కుటుంబానికి చెందిన చిన్న ఇంటిని కూడా పునర్నిర్మించుకోలేకపోయారు. చివరి దశలో ఆ ఇంటిలోనే గడిపిన ఆయన కటిక నేలమీదే పడుకునేవారు. ఫలితంగా భోలా పాశ్వాన్ తదనంతరం కొడుకుల్లేని ఆయన కుటుంబం పేదరికంలోనే జీవిస్తోంది.
Also Read : తెలంగాణకు గట్టి షాక్, పాలమూరు-రంగారెడ్డి ఆపాలని NGT ఆదేశం