iDreamPost
android-app
ios-app

పీవీకి భార‌త‌ర‌త్న పుర‌స్కారం ఇవ్వండి

పీవీకి భార‌త‌ర‌త్న పుర‌స్కారం ఇవ్వండి

మ‌హా నేత‌, భారత మాజీ ప్ర‌ధాన మంత్రి పాములపర్తి వెంకట నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని తెలంగాణ అసెంబ్లీ కోరింది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మంగళవారం సభ ప్రారంభం కాగానే పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని, పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని పెట్టాలని, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టి స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. పీవీ దార్శనికతను కొనియాడుతూ ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిన ఆవశ్యకతను ఉటంకిస్తూ ప్రసంగించారు.

అనంతరం కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీల తరఫున మల్లు భట్టి విక్రమార్క, కేటీఆర్, సత్యవతి రాథోడ్, రాజాసింగ్, గంగుల కమలాకర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాజయ్య, శ్రీధర్‌ బాబు, శ్రీనివాస్‌గౌడ్, రెడ్యానాయక్‌లు ప్రసంగించి సీఎం ప్రవేశపెట్టిన తీర్మా నానికి మద్దతు తెలిపారు. ఎంఐఎం తరఫున ఎవరూ చర్చలో పాల్గొనలేదు. తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతి వ్వడంతో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమో దించినట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు.

కేంద్రానికి ఇదే మా విన‌తి..

’తెలంగాణ బిడ్డ, దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థిక సంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతి కోవిదుడు, బహుభాషావేత్త, దేశ ప్రగతికి ఉజ్వల దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాల్లో మేరునగధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి పాములపర్తి వెంకట నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని, పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని, చిత్తరువునూ ప్రతిష్టించాలని, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది’అని సీఎం కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. కాగా, కేసీఆర్‌ సూచన మేరకు శాసనసభ ప్రాంగణంలో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్‌ పోచారం ప్రకటించారు.

మండలిలోనూ ఏకగ్రీవంగా ఆమోదం

పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనమండలి సైతం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం కేసీఆర్‌ తరఫున వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టి పీవీ దార్శనికతను కొనియాడారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు టి. జీవన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, పురాణం సతీష్, భానుప్రసాద్, నారదాసు లక్ష్మణరావు ప్రసంగించారు. నెక్లెస్‌ రోడ్డుకు ‘పి.వి. నరసింహారావు నెక్లెస్‌ రోడ్డు’గా నామకరణం చేయాలని, పదో తరగతి పాఠ్యాంశాల్లో పీవీపై ఒక చాప్టర్‌ను పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఈ తీర్మానాన్ని మండలి ఏకగ్రీవంగా ఆమోదించినట్లు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు.