iDreamPost
android-app
ios-app

బెంగాల్‌లో మమతకు మరో షాక్‌

బెంగాల్‌లో మమతకు మరో షాక్‌

బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకీ వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. పక్షం రోజుల క్రితం ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సువెంధు అధికారి రాజీనామా చేయగా, తాజాగా మరొకరు మమత మంత్రివర్గం నుంచి వైదొలిగారు. రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి లక్ష్మీ రతన్‌ శుక్లా మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని సీఎం మమతా బెనర్జీకి, రాష్ట్ర గవర్నర్‌కు పంపారు. రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ తాను రాజకీయాల నుంచి రిటైర్‌ కావాలనుకుంటున్నానని మమతా బెనర్జీకి రాసిన లేఖలో శుక్లా పేర్కొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఎమ్మెల్యే పదవికి శుక్లా రాజీనామా చేయలేదు.

నేనే గవర్నర్‌కు సిఫార్సు చేస్తా : మమత

ఇదిలా ఉండగా శుక్లా రాజీనామాపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఆయన రాజీనామాపై తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవని అన్నారు. తిరిగి క్రీడల్లో క్రియాశీలకం కావాలని శుక్లా కోరుకుంటున్నారని, తన పదవి చివరి రోజు వరకు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందిస్తారని మమతా అన్నారు. ఆయన రాజీనామాను ఆమోదించాల్సిందిగా గవర్నర్‌కు సిఫార్సు చేస్తానన్నారు. మరోవైపు..మార్చి-ఏప్రిల్‌లో బెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. 100 అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టాలని శివసేన యోచిస్తోంది. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాకరే బెంగాల్‌లో పర్యటిస్తారని శివసేన పార్టీ నేతలు తెలిపారు. కాగా, బెంగాల్‌లో సీట్ల సర్దుబాటు కోసం లెఫ్ట్‌ పార్టీలతో చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధీర్‌ రంజన్‌ చౌధురి నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది.

లక్ష్మీ రతన్ శుక్లా 1999 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత జట్టులో అరంగ్రేటం చేసాడు. కానీ అంతగా రాణించక పోవడంతో కేవలం 3 మ్యాచులు మాత్రమే భారత జట్టు తరపున ఆడగలిగాడు. ఐపీఎల్ లో మాత్రం కోల్‌కత నైట్ రైడర్స్,ఢిల్లీ డేర్ డెవిల్స్,సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల తరపున ఆడాడు. ఐపీఎల్ లో 47 మ్యాచుల్లో 405 పరుగులు సాధించిన ఈ ఆల్ రౌండర్ 15 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత జట్టు తరపున మాత్రం మూడు మ్యాచుల్లో 18 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే సాధించాడు.