పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల పోరు సుదీర్ఘంగా కొనసాగుతోంది. మొత్తం ఎనిమిది దశలు కావడంతో ఇంకా ఎన్నికల సంగ్రామం కొనసాగుతూనే ఉంది. మార్చి 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే మార్చి 27న తొలి దశ పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 1 రెండో దశ, 6న మూడో విడత, నాలుగు రోజుల క్రితం ఈ నెల 10న నాలుగో విడత పోలింగ్ ముగిసింది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలు గల బెంగాల్ లో ఇప్పటి వరకూ జరిగిన ఈ నాలుగు విడతల పోలింగ్ ఓ ఎత్తు, త్వరలో జరగబోయే నాలుగు విడతల పోలింగ్ లోని జిల్లాలలో సాధించే పట్టు మరో ఎత్తు. ఆ జిల్లాల్లో సాధించే సీట్లను బట్టే ఆయా పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఐదో విడత పోలింగ్ ఈ నెల 17న జరగనుంది. దీంతో టీఎంసీ, బీజేపీ తమ జోరు కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రచారాన్ని ఎప్పటికప్పుడు రక్తి కట్టిస్తూనే ఉన్నాయి. రెండు పార్టీల నేతలూ ఇప్పుడు రాష్ట్రంలోని ఓ రెండు జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అత్యధిక సార్లు ఓటర్లను కలిసేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
మోదీ, దీదీ వాటిపైనే దృష్టి
రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణా, దక్షిణ 24 పరగణా జిల్లాలు త్వరలో జరగబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. ఆ రెండు జిల్లాల్లోనే 64 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. దక్షిణ 24 పరణాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల ఎన్నికలు నాలుగో దశలో పూర్తయ్యాయి. అత్యధిక ప్రాంతాల్లో ఇంకా జరగాల్సి ఉంది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ ఇతర కీలక నేతలు ఆ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించారు. గతంలో రాష్ట్ర మొత్తం వామపక్షాల హవా కొనసాగే సమయంలో ఆ రెండు జిల్లాల్లో కూడా కమ్యూనిస్టులకే బాగా పట్టు ఉండేది. సింగూర్ నందిగ్రామ్ ఉద్యమాల అనంతరం వామపక్షాల కోటకు బీటలు పడి మిగితా ప్రాంతాల్లో లాగే ఇక్కడ కూడా మమతబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది.
రెండు సార్లూ టీఎంసీదే పై చేయి
గత రెండు పర్యాయాలు కూడా ఆ జిల్లాల్లో టీఎంసీయే విజయఢంకా మోగిస్తూ వస్తోంది. 2011, 2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులే మెజార్టీ స్థానాలు గెలుపొందారు. ఉత్తర 24 పరగణా జిల్లాలోని 33 నియోజకవర్గాల్లో 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 27 నియోజకవర్గాల్లో గెలిచింది. అలాగే దక్షిణ 24 పరగణా జిల్లాలోని 31 నియోజకవర్గాల్లో టీఎంసి 29 చోట్ల విజయం సాధించింది. అయితే తర్వాత 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికలో ఉత్తరపరగణా జిల్లాలో ఉన్న ఐదు స్ధానాల్లో బీజేపీ 2 చోట్ల గెలిచింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఎంఎల్ఏల్లో ఐదుగురితో పాటు కొందరు సీనియర్లను బీజేపీ ఆకర్షించింది. దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ టీఎంసీ దూకుడుకు కాస్త బ్రేక్ పడే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఒకవేళ సర్వేలు చెబుతున్నట్లు మొత్తం టీఎంసీ గాలి వీస్తే మాత్రం ఇక్కడ కూడా గత ఫలితాలే పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.