iDreamPost
iDreamPost
ఒకప్పుడు పోస్టు అంటే ఉత్తరం. అది రాసి పోస్టు చేసాక ఎప్పుడు చేరుతుందో తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం పోస్టు అంటే సోషల్ మీడియాలో మెస్సేజ్. చేసే వాళ్ళకు అది మెస్సేజే కావొచ్చు. కానీ దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అన్నది ఊహించలేం. ఉదాహరణకు బెంగళూరు ఘటననే తీసుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు పోటాపోటీగా చేసుకున్న మెస్సేజ్‌లు ఒక భారీ విధ్వంసానికి కారణమయ్యాయి. ఇక్కడ వ్యక్తులు కావొచ్చు, వ్యవస్థలు, మతాలే కావొచ్చు. కానీ అమాయకులకు చెందిన ప్రాణాలు, ఆస్తులు ధ్వంసం కావడం అత్యంత దారుణమైన విషయం.
శత్రులు పుకార్లను పుట్టిస్తారు.. అజ్ఞానులు వాటిని ప్రచారం చేస్తారు.. మూర్ఖులు వాటిని నమ్ముతారు అని బుద్ధుడు వాఖ్యలుగా చెబుతారు. ఇప్పుడున్న అత్యంత ఆధునికమైన సమాచార వ్యవస్థలు ఈ సూత్రాన్ని ప్రతి ఒక్కరు ఒకటికి వంద సార్లు గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సెల్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కడు ఒక అరిస్టాటిల్, ఒక సోక్రటీస్.. అంతకంటే ఎక్కువే అయిపోతున్నారు. ఆన్‌లైన్‌లో దొరికే ప్రతి విషయాన్ని తమ కాంటాక్ట్స్‌లో ఉన్న వారందరికీ ప్రచారం చేసేందుకు క్షణం కూడా ఆలోచించడం లేదు.
ఇది ఏ స్థాయికి చేరిందంటే తాము ఫార్వార్డ్ చేసిన మెస్సేజ్‌కు అర్ధం కూడా అర్ధం చేసుకోకుండా తోసేయడానికే ప్రాధాన్యమివ్వడం మానవ జీవనంలో అత్యంత హీనదశగానే చెప్పుకోవాలి. ఎందుకు ఈ స్థాయిలో చెప్పాల్సి వస్తుందంటే. ఒక పక్క కరోనాతో కకావికలు అవుతున్న దేశంలో కేవలం మతం ప్రాతిపదికన హింశకు కారణం కావడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం (మరింత కఠినమైన పదం వాడలేకపోతున్నందుకు క్షమించాలి) మరొకటి ఉండదు.
సోషల్ మీడియాలో ఒక్క మెస్సేజ్‌కు విలువ.. మూడు ప్రాణాలు, ఆరవై కార్ల ధ్వంసం, మరింత ఆస్తి నష్ఠం. దీన్ని బట్టే మనం ఊహించుకోవచ్చు. మనం ఏస్థాయి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నామో. స్నేహితుడు పంపాడనో, తోటి వారు చెప్పారనో మనకు తోచినది సోషల్ మీడియాలో పోస్టు చేసుకుంటే పోతే చివరికి దాని ఫలితం ఏ స్థాయి దారుణానికైనా దారితీయొచ్చు. సో ఫ్రెండ్స్ బీ కేర్‌ఫుల్. మీరు చేసే ప్రతి మెస్సేజ్‌కు బాధ్యత మీదే. దాని కారణంగా జరిగే ప్రతి నష్టానికి కూడా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది నైతికంగానైనా.. చట్ట ప్రకారమైనా.. కాస్త గుర్తుంచుకోండి.