iDreamPost
iDreamPost
బీసీలు మాకు ఆయువు పట్టు అని చెప్పుకునే తెలుగుదేశం ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉంది. బీహార్ లో అన్ని పార్టీలు కలిసి అఖిలపక్షంగా ప్రధాని వద్దకు వెళ్లేలా అక్కడి విపక్షం ఒత్తిడి తెచ్చింది. కానీ ఏపీలో ప్రతిపక్షం ఎందుకు మాట్లాడలేదు. బీసీ జనగణన విషయంలో కోర్టులో కేంద్రం అపిడవిట్ దాఖలు చేసింది. జనాభా లెక్కల సేకరణలో కులాల వారీగా వివరాలు సేకరించలేమని చెప్పేసింది. అయినా చంద్రబాబు ఎందుకు పెదవి విప్పలేదు. ఇప్పుడు హఠాత్తుగా ప్రధాని కి లేఖ పేరుతో చంద్రబాబు వేసిన స్కెచ్ ఏమిటీ, ఇన్నాళ్లుగా గుర్తుకురాని బీసీలను ఇప్పుడెందుకు చంద్రబాబు గుర్తు చేసుకుంటున్నారు.
దీని వెనుక పెద్ద వ్యవహారమే ఉంది. ఏపీ ప్రభుత్వం బీసీ జనగణన కోసం కేంద్రాన్ని విన్నవించాలని సిద్ధమయ్యింది. దానికోసం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించాలని నిర్ణయించింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు సీఎం సమాయత్తమవుతున్నారు. అంతే వెంటనే చంద్రబాబుకి కూడా బీసీలు, వారి జనాభా లెక్కలు గుర్తుకొచ్చేశాయి. ఇన్నాళ్ళుగా మరచిపోయిన విషయం మళ్లీ మొదటికి తెచ్చేశారు. దేశమంతా వివిధ పార్టీలు బీసీ జనగణనపై నినదిస్తుంటే పెదవి విప్పని చంద్రబాబుకి ఇప్పుడు హఠాత్తుగా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో కంగారు వచ్చేసింది. క్రెడిట్ కోసం తామే ముందు స్పందించామని చెప్పుకోవడానికి సిద్ధమయిపోయారు.
నిజానికి తాజా లేఖలో చంద్రబాబు పేర్కొన్నట్టుగా 2014లోనే టీడీపీ తీర్మానిస్తే ఇన్నాళ్లు ఎందుకు మాట్లాడలేదు. అసలు 2001 జనాభా లెక్కల నాడు టీడీపీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. మరి ఆనాడు ఏం చేసింది. పోనీ 2011లో యూపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. 2014 నుంచి 18 వరకూ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఈ అంశం మీద ఎందుకు పట్టుబట్టలేదు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలుండవు. కానీ తానే ముందు మాట్లాడినట్టు చెప్పుకోవడానికి సిద్ధమయిపోతారు. దానికి కొంత మీడియాలో తానతందాన బ్యాచ్ ఒకటి.
వాస్తవానికి జగన్ ఈ విషయంలో మాటల కన్నా చేతల ద్వారా ముందుకు సాగేందుకు సంకల్పించారు. దానికి తగ్గట్టుగా అసెంబ్లీ తీర్మానం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణా అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. ఏపీలో కూడా ప్రభుత్వమే దానికి అంగీకరించి, తీర్మానం రెడీ చేస్తోంది. దానిని గ్రహించిన చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా బీసీల మీద ప్రేమ ఒలకబోయం విస్మయకరంగా కనిపిస్తోంది. నిజంగా బీసీల మీద బాబుకి ప్రేమ ఉంటే దేశమంతా బీసీ గణన కోసం నినదిస్తున్న సమయంలో తాను కూడా మోడీ ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టి ఉండాలి. కేంద్రమేమో బీసీ జనగణన కుదరదని చెబుతుంటే ఒత్తిడి తెచ్చే మార్గాలు వెదకాలి. అన్నీ వదిలేసి ఓ లేఖ రాసి తన వల్లే జరిగిపోయిందని చెప్పుకోవడానికి మాత్రం ఆయన సంశయించరనేది అందరికీ తెలిసిన సత్యం. లేని ప్రేమను నటించి ఇన్నాళ్లుగా బీసీ వర్గాలను తన వెంట తిప్పుకున్న బాబుకి ఇప్పుడు హఠాత్తుగా బీసీలు దూరమవుతుండడంతో కొత్త ఎత్తులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది.
Also Read : Former Minister Kuthuhalamma – చంద్రబాబుకు షాక్ .. సొంత జిల్లాలో టీడీపీకి మాజీమంత్రి రాజీనామా