iDreamPost
iDreamPost
టీఆర్పీ కోసం కక్కుర్తిపడిన చానెళ్ల వ్యవహారం పెను దుమారంగా మారుతోంది. చివరకు రేటింగ్స్ కూడా నిలిపివేసే దశకు వచ్చింది. టెలివిజన్ రేటింగ్ పాయింట్(టీఆర్పీ) కుంభకోణంపై బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రిసెర్చి కౌన్సిల్(బార్క్) సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అవుతోంది. అన్ని భాషల వార్తాచానళ్లకు ప్రతివారం ఇచ్చే రేటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. 12 వారాలు పాటు ఎలాంటి రేటింగ్ ఇవ్వబోమని ఆ సంస్థ స్పష్టం చేసింది.
ప్రస్తుతం రేటింగ్ విధానం మీద ఈ పరిణామం చర్చకు దారితీస్తోంది. అనేక విమర్శలు రావడంతో నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన బార్క్ విధానంలో కూడా లోపాలు కొనసాగుతున్న తీరు మీద అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అందులో కొన్ని చానెళ్లు హద్దులు మీరుతున్న తీరు మీద వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ తరుణంలో తాము పాటిస్తున్న ప్రమాణాలపై టెక్నికల్ కమిటీ వేయాలని బార్క్ నిర్ణయించింది. మొత్తం విధానంపై రివ్యూ చేయాలని ఆశిస్తోంది. దానికోసం రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో, అప్పటి వరకూ రేటింగ్ ప్రకటించకూడదని నిర్ణయం తీసుకుంది.
మోసపూరితంగా టీఆర్పీని పెంచుకుంటున్నారనే అభియోగాలపై రిపబ్లిక్ టీవీ సహా.. మూడు చానళ్లపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో విచారణ సాగుతోంది. అయితే జర్నలిజపు విలువలు కేవలం టీవీలలో చెప్పడం వరకే తప్ప తమ అడ్డగోలు వ్యవహారాలకు అడ్డూ అదుపు ఉండదని ఆయా చానెళ్లు నిరూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీవీ యజమానుల సంస్థ ఎన్ బీ ఏ కూడా స్పందించింది. ఇలాంటి పరిస్థితి అవాంఛనీయమని, అంతా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది.
మరోవైపు టీఆర్పీ స్కామ్ లో ప్రధాన నిందితులుగా ఉన్న రిపబ్లిక్ టీవీ కి సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. తమ సిబ్బంది అరెస్టుల ప్రక్రియను అడ్డుకోవాలంటూ వేసిన పిటీషన్ ని సుప్రీంకోర్ట్ తోసిపుచ్చింది. ముంబై హైకోర్టుని ఆశ్రయించాలని వారికి సూచించింది.