iDreamPost
iDreamPost
90 దశకంలో సినిమాలు బాగా చూసిన వాళ్ళు మర్చిపోలేని పేరు ఇది. మాస్ ప్రేక్షకులను తన పాటలతో వెర్రెక్కిపోయేలా చేసి ఆడియో క్యాసెట్లు పదే పదే వినేలా చార్ట్ బస్టర్స్ కొట్టడం ఆయనకే సాధ్యం. సంగీత ప్రేమికుల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న బప్పీలహరి ఇవాళ ఉదయం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చివరి శ్వాస తీసుకున్నారు. ఈయన చివరి తెరమీద కనిపించిన షో బిగ్ బాస్ 15. అందులో తన మనవడు స్వస్తిక్ పాడిన కొత్త పాట లాంచ్ కోసం సల్మాన్ ఖాన్ తో అందులో భాగమయ్యారు. కొద్దిరోజుల తర్వాత అస్వస్థత గురైన బప్పీలహరిని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. మంచి చికిత్స అందినప్పటికీ కోలుకోలేకపోయారు.
బప్పీలహరి వయసు 69. అసలు పేరు ఆలోకేష్ లహరి. 1952 నవంబర్ 27న జన్మించారు. బెంగాల్ రాష్ట్రంలోని ఒక బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టిన బప్పీలహరి తల్లిదండ్రులు ఆపరేశ్, బన్సూరి ఇద్దరూ గాయకులే. వీళ్లకు ఈయనొక్కరే సంతానం. సుప్రసిద్ధ సింగర్ కిషోర్ కుమార్ ఈయనకు బంధువు. 3 ఏళ్ళ వయసులోనే తబలా వాయించడంతో తన ప్రస్థానం ఆరంభించారు. బప్పీలహరికి ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు బప్పాలహరి, అమ్మాయి రీమా లహరి. 1973లో నన్హా షికారితో బప్పీలహరి సినిమా ప్రయాణం మొదలయ్యింది. కెరీర్ ప్రారంభంలోనే జక్మీ, చల్తే చల్తే, సురక్షా, ఆప్ కి ఖాతిర్, వర్దాత్, టూటే ఖిలోనే లాంటి ఎన్నో సూపర్ హిట్స్ ఈయన ఖాతాలో ఉన్నాయి. తనదంటూ ఒక ముద్ర వేశారు. 1982లో వచ్చిన డిస్కో డ్యాన్సర్ బప్పీలహరికి అతి పెద్ద బ్రేక్.
రాక్ మ్యూజిక్ లో కొత్త ఒరవడి సృష్టించిన ఆ సినిమా దెబ్బకు హీరో మిథున్ చక్రవర్తితో పాటు ఈయన పేరు కూడా మారుమ్రోగిపోయింది. అక్కడి నుంచి వెనక్కు చూసే అవసరంరాలేదు. బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఎన్నో చేశారు. చివరిగా బప్పీలహరి సంగీతం ఇచ్చిన సినిమా 2020లో విడుదలైన టైగర్ శ్రోఫ్ భాగీ 3. తెలుగులోనూ బప్పీలహరిది చరిత్రలో చెప్పుకోదగ్గ ప్రస్థానం.. 1986లో కృష్ణ సింహాసనంతో తన ఎంట్రీ గ్రాండ్ గా అందుకున్నారు. చిరంజీవికి స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు లాంటి ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చారు. రౌడీ గారి పెళ్ళాం, నిప్పు రవ్వ, బ్రహ్మ, దొంగ పోలీస్, రౌడీ ఇన్స్పెక్టర్, బిగ్ బాస్, ఖైదీ ఇన్స్పెక్టర్, పుణ్యభూమి నా దేశం, ముద్దాయి ముద్దుగుమ్మ, రక్తతర్పణం, కలెక్టర్ విజయ, త్రిమూర్తులు ఇలా చెప్పుకుంటూ పోతే మరపురాని చిత్రాలు ఎన్నో. 2020లో డిస్కో రాజా టైటిల్ సాంగ్ కోసం తమన్ కంపోజింగ్ లో తన గాత్రం అందించారు. భౌతికంగా బప్పీలహరి లేకపోయినా ఆయన సంగీతం మాత్రం చిరస్మరణీయం.