చెక్ బౌన్స్ కేసు లో అరెస్ట్ అవడంతో సినీ నిర్మాత బండ్ల గణేష్ అప్పుల బాధిత ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. బండ్లగణేష్‌పై ప్రొద్దుటూరు కోర్టుల్లో సుమారు 66 కేసులు ఉన్నాయి. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 21, ఫస్ట్ ఏడీఎం కోర్టులో 66 చెక్ బౌన్స్‌లు నమోదు అవుతున్నాయి. ఫైనాన్షియర్లు ఇచ్చిన డబ్బుకు గాను ఆయన ఇచ్చిన చెక్కులు చెల్లక పోవడంతో వారందరూ 2017లో కోర్టును ఆశ్రయించారు. నిర్మాత బండ్ల గణేష్‌బాబు పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్ పేరుపై ప్రొద్దుటూరులో అప్పు తీసుకున్నాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి అతను రూ. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. 66 మందికి సంబంధించి బౌన్స్ అయిన చెక్కుల విలువ సుమారు రూ.8 కోట్ల వరకు ఉంటుందని కోర్టు వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికీ ఐదు సార్లు నిర్మాత బండ్ల గణేష్ వాయిదా నిమిత్తం ప్రొద్దుటూరు కోర్టుకు వచ్చారు. అయితే ఈ నెల 18న 35 కేసులకు సంబంధించిన చెక్‌బౌన్స్ కేసులో బండ్లగణేష్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా అతను రాలేదు. తిరిగి ఈ కేసును నవంబర్ నెలకు కోర్టు వాయిదా వేసింది.