iDreamPost
iDreamPost
ఇప్పుడంటే జీవితం యాంత్రికమైపోయి జనం వృత్తికి, వ్యాపారానికి పరుగులు పెట్టడమే సరిపోయింది కానీ ఒకప్పుడు బంధువుల రాకపోకలతో పండగలకి పబ్బాలకి ఇళ్ళు కళకళలాడుతూ ఉండేవి. ఇప్పుడు మహా అయితే ఒకటో రెండు రోజులో లీవ్ దొరకడమే మహా భాగ్యం అయినట్టు అలా కనిపించి ఇలా వచ్చి వెళ్లడం పరిపాటిగా మారింది. కానీ అప్పటి కాలంలోనైనా బంధువులందరూ ఒకే రీతిలో ఉండేవాళ్ళు కాదు. ఒక్కసారి వస్తే రోజులు నెలల తరబడి ఇంట్లో తిష్ట వేసే బాపతు కొల్లలు. వీళ్ళ ఖర్చులు భరించలేక సగటు మధ్యతరగతి జీవులు పడే యాతన అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమానే బంధువులొస్తున్నారు జాగ్రత్త.
1989 సంవత్సరం. హాస్య చిత్రాలకు మంచి ట్రెండ్ నడుస్తోంది. 15 ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రస్థానం సాగించిన శరత్ సుమన్ హీరోగా ‘చాదస్తపు మొగుడు’తో దర్శకుడిగా మారి ‘కులాల కురుక్షేత్రం’ లాంటి సీరియస్ సబ్జెక్టును కూడా హ్యాండిల్ చేసి మెప్పులు పొందారు. అయితే తనకు ఇష్టమైన ఎంటర్ టైన్మెంట్ జానర్ లో సినిమా తీయాలని నిర్ణయించుకుని ప్రముఖ రచయిత గిరిజశ్రీ భగవాన్ అందించిన కథ ఆధారంగా సత్యానంద్ తో కలిసి ‘బంధువులొస్తున్నారు జాగ్రత్త’ స్క్రిప్ట్ ని సిద్ధం చేయించారు. రాజేంద్ర ప్రసాద్, రజని జోడిగా చక్రవర్తి సంగీతం అందించగా సేన క్రియేషన్స్ బ్యానర్ పై చలసాని శరత్ బాబు నిర్మించారు.
అనాథ అయిన చిట్టిబాబు(రాజేంద్రప్రసాద్)స్నేహితుడి పెళ్లిలో సీత(రజిని)ని చూసి ఇష్టపడి ఏరికోరి పెళ్లి చేసుకుంటాడు. ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న తన జీవితంలోకి సీత బంధువులు ప్రవేశిస్తారు. ఇదంతా చూసిన చిట్టిబాబు మొదట సంబరపడిపోయి వాళ్లకు తెగ సేవలు చేస్తాడు. రాను రాను వాళ్ళే భారంగా మారి ఇంట్లోనే ప్రత్యక్ష నరకం చూపిస్తారు. ఈ సమస్య నుండి అతను ఎలా బయట పడ్డాడు అనేదే కథ. సినిమా ఆద్యంతం బంధువులు పెట్టే చిత్రహింసలతో సరదాగా సాగుతూనే మరోవైపు ఆలోచింపజేస్తుంది. కోట, గొల్లపూడి, సత్యనారాయణ, సుత్తివేలు, బ్రహ్మానందం, సూర్యకాంతం, రావికొండలరావు, శ్రీలక్ష్మి, రాధాకుమారి తదితరుల అద్భుత తారాగణంతో సినిమా గొప్పగా పండింది. ఆ ఏడాదిలో మంచి విజయం సాధించిన చిత్రంగా బంధువులొస్తున్నారు జాగ్రత్త గుర్తింపు పొందింది.