Idream media
Idream media
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో మళ్లీ గుబులు మొదలైందా..? మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటనలే అందుకు కారణమా..? చంద్రబాబు, లోకేష్ ఆ టీడీపీ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారా..? అసలు ఎందుకు గెలికారు..? మళ్లీ మీ వల్లే రగడ మొదలైంది.. అని టీడీపీ కేడర్ అధినాయకత్వంపై గుర్రుగా ఉందా..? అంటే అవుననే సమాధానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇటీవల తమిళనాడులో దొరికిన డబ్బుపై టీడీపీ రాద్దాంతం చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. డబ్బు దొరికిన కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో తొలుత ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిది అని, ఆ తర్వాత గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుదని టీడీపీ నేతలు విపరీతంగా ప్రచారం చేశారు. దీనిపై అసలు వ్యక్తి తెరపైకి రావడం.. ఆ డబ్బు తనదేనని ప్రకటన ఇవ్వడంతో ఆ వివాదం అక్కడితో సమసిపో్యింది.
మరి టీడీపీలో గుబులు కారణాలేంటి..?
కానీ.. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన మాటల యుద్ధంలో వెలుగులోకి వచ్చిన తాజా ప్రకటనలతో ప్రకాశం జిల్లా టీడీపీలో వణుకు మొదలైంది. తనపై వచ్చిన ఆరోపణలతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొంత మంది ముఖ్యనేతలు టీడీపీలో చేరారని, అందుకే తనపై ఆ పార్టీ ఇటువంటి ఆరోపణలు చేస్తోందని విమర్శిస్తూ… “ఎన్నికల సమయంలో మీ ఎమ్మెల్యేలకు డబ్బు ఇస్తానని ఎగ్గొట్టారట.. ఇప్పటి వరకూ ఇవ్వనే లేదట.. మీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. మీ గురించి..” అని చెప్పుకొచ్చారు. ఆ మాటలను బట్టి పరిశీలిస్తే.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రి బాలినేనితో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ గేట్లు తెరిస్తే.. రావడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది.
అందరి చూపూ ఆ ముగ్గరిపైనే…
ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వారిలో ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తన కుమారుడు కరణం వెంకటేష్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేర్పించారు. ఆయన ఇంకా వైసీపీ కండువా కప్పుకోలేదు కానీ.. టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా పని చేస్తున్నట్లు అందరూ భావిస్తున్నారు. ఇక మిగిలిన ముగ్గురూ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి. బాలినేని తాజాగా చేసిన వ్యాఖ్యల ద్వారా ఆయనతో వీరు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ.. ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడితే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే.. ముగ్గురూ చేరిపోతారా..? లేదా.. అనే దానిపై జిల్లాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు వైసీపీ గూటికి చేరారు. మాజీ మంత్రులు శిద్దా రాఘవరావు, రామారావు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీని వదిలి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శిద్దా రాఘవరావు… టీడీపీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, జాతీయ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహించేవారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వైసీపీ అభ్యర్థి మాగుంట చేతిలో ఓడిపోయారు. రాజకీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరు సంపాధించారు. ఇప్పటికే శిద్దా సోదరులు వైసీపీలో కొనసాగుతున్నారు. శిద్దా…టీడీపీ నుండి గతంలో ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. జిల్లాలో ఆయనకు రాజకీయంగా పట్టు బాగానే ఉంది. ఆయన రాకతో ఆల్రెడీ టీడీపీ సగం చచ్చిపోయింది. తాజా పరిణామాలతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.