Idream media
Idream media
మహా నగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలనగానే వెంటనే గుర్తుకు వచ్చేది లడ్డూ వేలం పాటలే. ప్రతి సంవత్సరం వేలం పాటల్లో లక్షలు పాడి గణేశ్ లడ్డూను సొంతం చేసుకునే వారు అధికంగానే ఉన్నారు. ఖైరతాబాద్ గణేశ్ మినహా.. గల్లీ గల్లీలోనూ గణపతి లడ్డూ పాటలు కోలాహలంగా జరుగుతాయి. ఆ కోలాహలానికి ఈసారి కరోనా బ్రేక్ వేసింది. ప్రత్యేకించి బాలాపూర్ లడ్డూ అంటేనే ఎంతో ఫేమస్. ప్రతి సంవత్సరం వేలం ద్వారా లడ్డూను సొంతం చేసుకునేందుకు పోటీపడుతుంటారు. కానీ ఈ సంవత్సరం కరోనా కారణంగా అసలు ఉత్సవాల నిర్వహణ సాదాసీదాగా జరిగింది. ప్రత్యేకించి ఖైరతాబాద్ గణేష్ ఎత్తు 9 అడుగులకే పరిమితం కాగా బాలాపూర్ లడ్డూను ఈసారి వేలం వేయలేదు. వేలం పాటలు నిర్వహిస్తే భారీసంఖ్యలో జనం గుమిగూడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి లడ్డూను వేలం వేయలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు ఈ లడ్డూను నిర్వాహకులు అందజేశారు. రాష్ట్రాధినేతపై గౌరవంతో ఆయనకు గణేష్ లడ్డూను అందజేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
మహా క్రేజు
ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ గణేశుడికి నగరంలో బాగా క్రేజీ ఉంటుంది. ఈ విగ్రహం వద్ద నవరాత్రుల పాటు పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ఊరేగింపు కూడా శోభాయమానంగా జరుపుతారు. అన్నింటికీ మించి బాలాపూర్ లడ్డూ వేలం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతుంది. లడ్డూ వేలం 1994లో మొదలైంది. మొదటి 450 రూపాయలకు లడ్డూ పలికింది. అలా మొదలైన పాట అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. లక్షలకు చేరింది. గతేడాది బాలాపూర్ లడ్డూను కొలను రాంరెడ్డి. 17.50 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూ అంత ప్రాచుర్యం పొందటానికి కారణం ఇక్కడి లడ్డూ పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయనే నమ్మకం ఉంది. లడ్డూ వేలం మొదలైన 17 సంవత్సరాల వరకూ కమిటీ నిర్వాహకులు స్థానికులకే అవకాశం కల్పించారు. తర్వాత స్థానికేతరులకూ చాన్స్ ఇవ్వడంతో పోటీ విపరీతంగా ఉండేది. కరోనా నేపథ్యంలో ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం పాటకు కూడా బ్రేక్ పడింది. దీంతో నిర్వాహకులు ఈ ఏడాది లడ్డూను కేసీఆర్ కు అందజేశారు.