iDreamPost
iDreamPost
హైదారబాద్ ని వరదలు మంచెత్తాయి. వారం రోజులుగా మెట్రో నగరం ముప్పుతిప్పలు పడుతోంది. సరిగ్గా అదే సమయంలో కూడా ఫేక్ న్యూస్ పరంపర తగ్గడం లేదు. వరద సహాయం విషయంలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఎవరైనా అధికారికంగా ప్రకటిస్తే వేరు గానీ, ఎటువంటి సంకేతాలు లేకపోయినా కొన్ని అంశాలు సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి.
అదే పరంపరలో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఆయన ఏకంగా కోటిన్నర రూపాయల వరద సహాయం ప్రకటించారని కొందరు పోస్టులు చేశారు. కానీ వాస్తవం వేరుగా ఉంది. నిజానికి బాలయ్య తన సొంత నియోజకవర్గం హిందూపురం వాసులను కూడా ఇటీవల కలిసిందే తక్కువ. కరోనా వచ్చి, అంతా కష్టాల్లో సమయంలో కూడా ఆయన కన్నెత్తి చూడలేదు. చివరకు ఆగష్ట్ నెలలో ఓ రెండు రోజులు నియోజకవర్గంలో మొఖం చూపించి మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు. తాజాగా అధిక వర్షాల కారణంగా రైతులకు అపార నష్టం సంభవించింది. అయినా ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్యకు అది పట్టని అంశమే అయ్యింది.
ఇలాంటి పరిస్థితుల్లో హిందూపురం వాసులు తమ ఎమ్మెల్యే తీరు మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దానిని కూడా పట్టించుకోని బాలకృష్ణ హైదరాబాద్ వరద బాధితుల పట్ల ఉదారంగా స్పందించారని చెబుతున్న సమాచారం పూర్తిగా అబద్ధమని తేలింది. సహజంగా సెలబ్రిటీలు తాము చేసిన సహాయం అధికారికంగా ప్రకటిస్తారు. ఒకరిని చూసి మరొకరు స్పందిస్తారు. కానీ ప్రస్తుతం అలాంటి వాతావరణం లేదు. తెలంగాణా ప్రభుత్వం కూడా ఎటువంటి సహాయం కోసం విజ్ఞప్తి చేయలేదు. అయినప్పటికీ బసవతారకం ట్రస్ట్ తరుపున కొంత, బాలయ్య వ్యక్తిగతంగా రూ.1.5 కోట్లు సాయం చేశారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
దానిని బాలయ్య వ్యక్తిగత కార్యదర్శులు కొట్టిపారేస్తున్నారు. ఈ సమాచారంతో తమకు సంబంధం లేదని ప్రకటించారు. ఎవరూ అటువంటివి విశ్వసించవద్దని కూడా చెబుతున్నారు. నిజానికి బాలయ్య ఏపీ వాసుల సమస్యల పట్ల స్పందించకుండా తెలంగాణా అంశంలో స్పందించినా రాజకీయంగా సమస్యలు వస్తాయని బాలయ్య వర్గం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఏమయినా వ్యక్తిగత సాయం చేయకపోయినా బాలయ్య చుట్టూ సాగుతున్న ప్రచారం మాత్రం వాస్తవం కాదని తేలింది.