కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానాల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది.. సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తికి టికెట్లు ఇస్తారు, అలా టికెట్ ఇచ్చిన క్రమంలో ప్రతిపక్షాలు అలాగే ఇతర పార్టీలు కూడా ఎవరు తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టే వారు కాదు. కానీ సంప్రదాయాలకు విరుద్ధంగా టిడిపి గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఓబుళాపురం రాజశేఖర్ ను తిరిగి ఉప ఎన్నికల బరిలో దిగాలని ఆదేశించడంతో వైసీపీ కూడా తమ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది.. అనారోగ్యంతో మరణించిన డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ సుధను, జగన్ తమ అభ్యర్థిగా గతంలోనే ప్రకటించారు..
అయితే ఈ ఉప ఎన్నిక విషయంలో వైఎస్ జగన్ ఈ రోజు క్యాంప్ ఆఫీస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఈ బద్వేలు ఉప ఎన్నిక ఇన్చార్జి బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో పెద్దిరెడ్డికి అప్పగించిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు పోల్ మేనేజ్మెంట్ లో ఆయనకు ఉన్న అనుభవం కారణంగా ఈ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జరిగిన సమావేశంలో ఒక్కో మండలం బాధ్యతను కూడా ఒక్కో ఎమ్మెల్యేకు జగన్ అప్పగించారు..మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సహాయకులుగా మంత్రులు ఆదిమూలపు సురేష్, అంజద్ బాషా, ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు.
Also Read : బద్వేలు ఉప ఎన్నిక : టీడీపీలో ఆశలు రేపుతున్న గోపవరం మండలం
ఇక నియోజకవర్గంలో ఉన్న కలసపాడు మండలానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించగా పోరుమామిళ్ల కు రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు. అలాగే కాశీనాయన మండలానికి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని, బి.కోడూరు మండలానికి రఘురాం రెడ్డిని, బద్వేల్ మండలానికి శ్రీకాంత్ రెడ్డిని, బద్వేల్ మున్సిపాలిటీ కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు.. అట్లూరు మండలం రవీంద్ర రెడ్డికి, గోపవరం మండలానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో క్లిష్టమైన గూడురు నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జిగా సమర్థవంతగా పని చేసి 38 వేల మెజారిటీ తీసుకొచ్చిన రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డికి బద్వేలు ఉప ఎన్నికల్లోనూ కీలక బాధ్యతలు ఇచ్చారు. కలసపాడు మండలానికి ఆయన్ను ఎన్నికల ఇంఛార్జిగా నియమించారు. అదే విధంగా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ ఇంఛార్జిగా పని చేసిన ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డిని అట్లూరు మండల ఇంఛార్జిగా నియమించారు.
2019 ఎన్నికల్లో వెంకటసుబ్బయ్య 44 వేల ఓట్ల మెజారిటీ రాగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అంతకుమించి మెజారిటీ వచ్చేలా కష్టపడాలని జగన్ సమావేశంలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని కోరిన ఆయన, ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకు వెళుతూ రాష్ట్ర స్థాయి నేతలతో ప్రచారం నిర్వహించాలని కోరారు. ఆలస్యం చేయకుండా వచ్చే సోమవారం నుంచే అన్ని కార్యక్రమాలు ప్రారంభించాలని జగన్ పేర్కొన్నారు.
Also Read : బద్వేల్ ఉప ఎన్నిక: చప్పుడు లేని బీజేపీ, జనసేన..!