iDreamPost
iDreamPost
ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొస్తుందో తెలియదు గానీ అప్పుడే బద్వేల్ బరిలో టీడీపీ అభ్యర్థిని దింపేశారు. చంద్రబాబు మళ్లీ పాత అభ్యర్థినే రంగంలో దించారు. దాంతో డాక్టర్ రాజశేఖర్ పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా చంద్రబాబు షెడ్యూల్ రాకముందే అభ్యర్థిని ఖరారు చేసి రంగంలో దించారు. కానీ అక్కడ కూడా టీడీపీ సుదూరంగా రెండో స్థానంలో నిలిచింది. చంద్రబాబు ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు బద్వేల్ లో కూడా అదే రీతిలో అభ్యర్థిని ముందే తెరమీదకు తెచ్చిన తరుణంలో టీడీపీ ఏం ఆశిస్తుందన్నది ఆసక్తికరం.
బద్వేల్ రాజకీయాల్లో టీడీపీని ఓటర్లు పెద్దగా ఆదరించిన దాఖలాలు లేవు. ఆపార్టీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి ఇప్పటి వరకూ కేవలం మూడు సార్లు మాత్రం విజయం సాధించింది. ఆ మూడు సార్లు ఒకే అభ్యర్థి గెలవడం విశేషం. టీడీపీ తరుపున బరిలో దిగిన బిజివేముల వీరారెడ్డి 1985, 1994, 1999 ఎన్నికల్లో గెలిచారు,వీరారెడ్డి మరణంతో 2001లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమార్తె విజయమ్మ గెలిచారు. ఆ తరువాత జరిగిన నాలుగు ఎన్నికల్లో టీడీపీ వరుస ఓటములు ఎదురుకొన్నది. దాంతో బద్వేల్ లో టీడీపీ జెండా ఎగిరి రెండు దశాబ్దాలు గడిచిపోతోంది.
Also Read:పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతారట,బాబుగారి బెదిరింపు
ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఎంఎస్ ఆర్థోపెడిక్ అయిన ఓబులాపురం రాజశేఖర్ ని టీడీపీ తరుపున పోటీకి నిలిపింది. అయినప్పటికీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దివంగత వెంకట సుబ్బయ్య ఏకంగా 95వేల పైచిలుకు ఓట్లు సాధించగా, టీడీపీ అభ్యర్థి మాత్రం కేవలం 50,748 ఓట్లకే పరిమితమయ్యారు. 44వేల ఓట్లకు పైగా తేడాతో ఓటమి పాలయ్యారు.
ఈ నేపథ్యంలో ఈ ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి మరోసారి మాదిగ సామాజికవర్గానికే చెందిన రాజశేఖర్ ని పోటీకి నిలపడం వెనుక ఆ కులస్తుల సంఖ్య ఎక్కువగా ఉండడమే కారణమని తెలుస్తోంది. అంతేగాకుండా డాక్టర్ రాజశేఖర్ కి బంధుత్వం, సంబంధాలు కలిగిన వారు కూడా అత్యధికంగా ఉండడం కీలకం. 2019 ఎన్నికలలో టీడీపీ టికెట్ కోసం 2014లో ఓడిపోయిన విజయజ్యోతి ,2014 ఎన్నికలో వైసీపీ తరుపున గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన జయరాములు ఇద్దరు పోటీ పడ్డారు.కానీ విజయమ్మ ఇద్దరికీ మద్దతు ఇవ్వకపోవటంతో వారికి టికెట్ దక్కలేదు.
Also Read:దుష్ప్రచారంపై జగన్ స్వీట్ కామెంట్స్
బద్వేల్ లో మెడికల్ షాపు నిర్వాహకుడిగా ఉన్న రాజశేఖర్ సోదరుడి చొరవతో ఆయన ముందుకొచ్చారు. రాజశేఖర్ సోదరుడికి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తో పరిచయం ఉండటం కలిసొచ్చింది. విజయమ్మ వర్గీయుడికే టికెట్ ఇచ్చారంటూ అప్పట్లో విజయజ్యోతి ఇండిపెండెంట్ గా నామినేషన్ కూడా దాఖలు చేశారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వెంకటసుబ్బయ్య మరణించడంతో ప్రస్తుతం ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. దాంతో వారి కుటుంబం నుంచే అధికార పార్టీ అభ్యర్థి ఉంటారని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ స్వయంగా బద్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. బద్వేల్ ని రెవెన్యూ డివిజనల్ కేంద్రంగా చేస్తానని చెప్పిన మాటను అమలు చేస్తున్నారు. దాంతో ఓవైపు సానుభూతి, మరోవైపు జగన్ నాయకత్వం మీద ఉన్న విశ్వాసంతో బద్వేల్ ఓటర్లు వైఎస్సార్సీపీకి పట్టంగట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే టీడీపీ మాత్రం బలమైన నేతను బరిలో దింపడం ద్వారా పరువు నిలుపుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. మరి బాబు కలలను బద్వేల్ వాసులు ఏమేరకు నెరవేరుస్తారో చూడాలి.