iDreamPost
iDreamPost
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా వాళ్ళకంటూ కొన్ని వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉంటాయి. అవి నటనకు సంబంధించినవే కాకపోవచ్చు. అలా అని వాటిని సినిమాలకు ముడిపెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే ఏం జరుగుతుందో చెప్పే మంచి ఉదాహరణ బాబా. 2002 సంవత్సరం. సూపర్ స్టార్ రజినీకాంత్ మార్కెట్ భీభత్సంగా ఉన్న టైం. తెలుగులోనూ బలమైన బేస్ ఏర్పడింది. తలైవా డబ్బింగ్ చిత్రం వస్తోందంటే చాలు మన నిర్మాతలు తమ పోటీ చిత్రాలను కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చేది. ఒకదశలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ తెల్లవారుఝామున బెనిఫిట్ షోలు వేసేంత రేంజ్ కి చేరుకున్నారు రజిని.
బాషా బాక్సాఫీస్ రికార్డులతో చరిత్ర సృష్టించాక తెలుగులో పెదరాయుడు కూడా అంతే గొప్పగా వసూళ్లను రాబట్టుకుంది. ఆపై ముత్తు, అరుణాచలం, నరసింహ ఒకదాన్ని మించి మరొకటి సౌత్ లోని నాలుగు రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టించాయి. అభిమానుల ఆనందానికి అడ్డు అదుపు లేకుండా పోయాయి. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో ఉన్న రజని కొత్త సినిమా ప్రకటన చేస్తే చాలు కోట్లు కుమ్మరించేందుకు బయ్యర్లు సిద్దమవుతున్న వేళ దర్శకుడు సురేష్ కృష్ణతో కలిసి బాబాను ప్రకటించారు రజినీకాంత్, ఇంకేముంది అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అనగానే మరోసారి సునామి ఖాయమనుకున్నారు.
నిజానికి బాబాకు ముందో కమర్షియల్ స్టోరీ అనుకున్నారు. అయితే రజని తాను ప్రాణంగా భావించే హిమాలయాల్లో ఉండే మహావతార్ బాబాజీని ఒక కనిపించని పాత్రగా మలచి తనే స్వంతంగా కథ రాసుకున్నారు. ఓ నాస్తికుడు దైవభక్తి వైపు ఎలా మళ్ళాడు అనే పాయింట్ కి మసాలాలు జోడించి అది చాలదన్నట్టు రాజకీయ అంశాలను ముడిపెట్టారు రచయితలు గోపు బాబు. హీరోకి అతీత శక్తులు కూడా జోడించారు. స్క్రిప్ట్ ని ఇంత కలగాపులగం చేయడంతో బాబా కాస్తా ప్రేక్షకులతో అయ్యబాబోయ్ అనిపించాడు. దెబ్బకు బాబా దారుణమైన డిజాస్టర్ గా మిగిలి బయ్యర్లను నిండా ముంచాయి. మూడు గంటల నిడివి, అతిశయోక్తి కథనం, అర్థం లేని హీరోయిజం, సింక్ అవ్వని భక్తి థ్రెడ్ వెరసి మొత్తానికి బాబాకు దారుణమైన ఫలితాన్ని అందించాయి.