iDreamPost
android-app
ios-app

అయ్యన్నకు చిర్రెత్తుకొచ్చింది !!

అయ్యన్నకు చిర్రెత్తుకొచ్చింది !!

ఎక్కడో కూచుని జూమ్ కబుర్లు చెబితే ఎలా ?

అధినేతనే ప్రశ్నించిన సీనియర్

ఔను సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు ముక్కుసూటి మనిషి. మనసులో ఏదీ దాచుకోడు.. దాచుకోలేడు… ఆ క్షణానికి ఏది అనాలనిపిస్తే అది అనేస్తాడు.
గ‌తంలో గంటా శ్రీ‌నివాస‌రావుని పార్టీలోకి తీసుకునే సంద‌ర్భంలోనూ, తీసుకున్న త‌ర్వాత కూడా ప‌దేపదే అధినేత చంద్రబాబు సమక్షంలోనే ప్రశ్నించాడు. తెలంగాణ‌లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్న‌ప్పుడు కూడా మొట్ట మొద‌ట బాబు నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా విమ‌ర్శ‌లు చేశారు. తాము కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటే జనాలు హర్షించరు అని కుండబద్దలు కొట్టారు. ఇక తాజాగా బాబు వ్య‌వ‌హార‌శైలిపై అయ్య‌న్న‌లోని అసంతృప్తి మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది.

గ‌త కొన్ని నెలలుగా చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేశ్ హైద‌రాబాద్‌కే ప‌రిమితం కావ‌డం తెలిసిందే. 70 ఏళ్ల పైన వ‌య‌సున్న చంద్ర‌బాబు ముందస్తు జాగ్ర‌త్త‌ల్లో భాగంగా గత ఆరు నెలలుగా హైదరాబాద్ లో ఇంటికే ప‌రిమిత‌మై…ఆన్‌లైన్ స‌మా వేశాలు నిర్వ‌హిస్తున్నారు. జూమ్ యాప్ ద్వారా కార్యకర్తలకు ఏదో చెప్పాల్సింది చెప్పేస్తున్నారు. అప్పుడప్పుడు ఏదో పరామర్శలకు మాత్రం విజయవాడ వచ్చి వెనువెంటనే మళ్ళీ హైద్రాబాద్ వెళ్లిపోతున్నారు. దీంతో టీడీపీ ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ దాదాపు క‌నుమ‌రుగు అయింద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో పార్టీ ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జార‌డం మాజీ మంత్రి అయ్య‌న్న‌ను తీవ్ర ఆవేద‌న‌కు గురిచేసింది.

చంద్ర‌బాబు నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పార్టీని న‌డుపుతున్న తీరుపై చంద్ర‌బాబుకు నేరుగా త‌న అసంతృప్తిని అయ్య‌న్న‌పాత్రుడు వ్య‌క్తం చేశారని
తెలిసింది. పార్టీ ఆఫీస్‌కు తాళం వేసి వెళ్లిపోతే ఎలా? ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటారు? కార్య‌క‌ర్త‌ల‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నాం? ఇలాగైతే పార్టీని ఎవరూ బతికించలేరు అని చంద్రబాబుపై అయ్య‌న్న‌పాత్రుడు ఫైర్ అయిన‌ట్టు స‌మాచారం.

ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉండిపోవడం, ఏదో చుట్టపు చూపుగా అప్పుడ‌ప్పుడు వచ్చి వెళ్లిపోవడం ఏంట‌ని అయ్యన్న నిల‌దీసిన‌ట్టు తెలుస్తోంది. అలాగే ఆన్‌లైన్‌ సమావేశాలు, మీడియా మీట్‌ల‌కు ప‌రిమిత‌మై, ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోక‌పోతే పార్టీకి భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని అయ్య‌న్న హెచ్చ‌రించిన‌ట్టు స‌మాచారం. రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తాళం వేసి అధ్యక్షుడు నెలల తరబడి హైదరాబాద్‌లో గడుపుతుంటే ప్రజలు ఏమనుకుంటారని అయ్యన్న ప్రశ్నించినట్లు సమాచారం.

అయ్య‌న్న హెచ్చ‌రిక‌ల‌పై టీడీపీలో విస్తృత చ‌ర్చ సాగుతోంది. అయ్య‌న్న ఆగ్ర‌హంలో న్యాయం ఉంద‌ని, ఆయ‌న చెప్పింది క‌రెక్ట్ అని పార్టీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. మొత్తానికి పార్టీ క్యాడర్ కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నప్పటికీ ధైర్యంగా మాట్లాడే దమ్ము అయ్యన్నకే ఉందని మరోమారు రుజువైంది.