iDreamPost
android-app
ios-app

అయోధ్య పై నేడే తీర్పు – భద్రత కట్టుదిట్టం

అయోధ్య పై నేడే తీర్పు – భద్రత కట్టుదిట్టం

అయోధ్య పట్టణంలోని రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదాస్పద భూమిపై నేడు శనివారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సోమవారం వరకూ కాలేజీలు, పాఠశాలలు, పలు విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

తీర్పు నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారించేందుకు ఉత్తరప్రదేశ్‌లో అణువణువునా భద్రత కట్టుదిట్టం చేశారు. రక్షణ దళాలను అత్యవసరంగా తరలించేందుకు అయోధ్య, లక్నోలలో హెలికాఫ్టర్లు, రాష్ట్ర రాజధానిలో ఎయిర్‌క్రాఫ్ట్‌లను సిద్ధంగా ఉంచారు. పరిస్థితులను అదుపులో ఉంచేందుకు డివిజనల్ కమిషనర్లు, ఏడీజీపీ, ఐజీ స్థాయి అధికారులు రాత్రంతా వారి వారి జోన్లలో అందుబాటులో ఉండి భద్రతను పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని, స్థానిక ప్రజలకు రక్షణగా అసాంఘిక శక్తులపై కన్నేసి ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. భద్రతా చర్యలపై సుప్రీం చీఫ్ జస్టిస్ రంజాన్ గొగోయ్ అధికారులపై సమీక్ష నిర్వహించారు. పలు సూచనలు చేశారు.