iDreamPost
android-app
ios-app

బ్రేకులు ఫెయిలయిన ఆటో – Nostalgia

  • Published Nov 13, 2020 | 1:51 PM Updated Updated Nov 13, 2020 | 1:51 PM
బ్రేకులు ఫెయిలయిన ఆటో – Nostalgia

స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ఫార్ములాకు అనుగుణంగా వెళ్ళక తప్పదు. అందులోనూ కమర్షియల్ సబ్జెక్టు ఎంచుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. ఇమేజ్ ఉంది, మార్కెట్ జరుగుతోంది కదాని ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్తే దెబ్బ తప్పదు. ఇది ప్రతి ఒక్క హీరోకు అనుభవమే. 1998 సంవత్సరం. అన్నమయ్య లాంటి భక్తిరస చిత్రంతో ఆంధ్ర రాష్ట్ర మొత్తాన్ని భక్తి సాగరంలో ఓలలాడించిన నాగార్జునకు ఆ వెంటనే నిన్నే పెళ్లాడతా రూపంలో ఆల్ టైం ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ దక్కింది. ఆవిడా మా ఆవిడా నిరాశపరిచినా కూడా ఎంటర్ టైన్మెంట్ కోణంలో అభిమానులను ఓ మాదిరిగా సంతృప్తిపరిచింది. అప్పుడు చేసిందే ఆటో డ్రైవర్.

ఆ టైంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా చిన్న నగరాలు పట్టణాల్లో ఆటోల ట్రెండ్ జోరుగా ఉంది.. రిక్షాలు క్రమంగా కనుమరుగవుతున్న తరుణంలో పెద్దగా చదువుకోని యువత ఆటోలు నడుపుకుంటూ స్వయం ఉపాధి జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో హీరో పాత్రనే ఆటో డ్రైవర్ గా చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ప్రముఖ రచయిత భూపతిరాజాను ఈ కథ రాసేందుకు ప్రేరేపించింది. పోసాని కృష్ణమురళి సంభాషణలతో స్క్రిప్ట్ సిద్ధమయ్యింది. తమిళ దర్శకుడు సురేష్ కృష్ణ మాస్టర్ తో అప్పటికే తెలుగులో స్ట్రెయిట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. రీమేక్ చేసిన ఆహా ఫ్లాప్ అయ్యింది. అయినా ఆటో డ్రైవర్ కి ఆయనే డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యారు. నిర్మాత నాగార్జునకు అత్యంత ఆప్తుడు శివప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించేందుకు రెడీ అయ్యారు.

పెళ్లి సందడితో యువతను వలలో వేసుకున్న దీప్తి భట్నాగర్ మెయిన్ హీరోయిన్ గా సిమ్రాన్ మరో కథానాయికగా ఎంపికయ్యింది. దేవా సంగీతం ఇచ్చారు. ఓ ఆటో డ్రైవర్ మిస్ ఇండియా లాంటి అందగత్తెను ప్రేమిస్తే జరిగే పరిణామాలు ఏమిటి అనే పాయింట్ మీద దీని స్టోరీ సాగుతుంది.ఇందులో హీరో పాత్ర పేరు జగన్. గర్భిణులకు ఫ్రీ సర్వీస్ ఇస్తుంటాడు. అయితే డ్రామా ఓవర్ డోస్ కావడంతో పాటు కనెక్ట్ కాలేని అనవసర అంశాలు ఎక్కువగా ఉండటంతో ఆటో డ్రైవర్ కు డిజాస్టర్ ఫలితం తప్పలేదు. ఎంటర్ టైన్మెంట్ మిస్ ఫైర్ కావడం కూడా ప్రధాన మైనస్. ఉన్నంతలో ఓ మూడు పాటలు పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ రిజల్ట్ పరంగా మాత్రం బ్రేకులు ఫెయిలైన ఆటోగా యాక్సిడెంట్ కు గురయ్యింది.