కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. సాటి మనిషిని అంటరానివారిగా మార్చిన ఘనత కరోనాకే దక్కుతుంది. కరోనా కష్టకాలంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ వారియర్లుగా పనిచేస్తూ ప్రజల ప్రాణాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న డాక్టర్ల పనితీరును ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది. విధి నిర్వహణలో వృత్తి నిబద్ధతకు ప్రతిరూపంగా నిలిచిన కొందరు డాక్టర్లు విన్నూత్న ప్రదర్శనలతో కరోనా రోగులను ఉత్సాహ పరుస్తున్నారు. తాజాగా ఓ డాక్టర్ కోవిడ్ పేషేంట్లను ఉత్సాహపరిచేందుకు చేసిన విన్నూత్న ప్రయత్నం నెటిజన్ల ప్రశంసలు పొందుతుంది.
అస్సాంలోని సిల్చార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈఎన్టీ సర్జన్ గా అరుప్ సేనాపతి పనిచేస్తున్నారు. కాగా కరోనా రోగులను ఉత్సాహపరిచేందుకు, వారిని ఉల్లాసభరితంగా మార్చేందుకు అరుప్ సేనాపతి డాన్సర్ గా మారారు. పీపీఈ కిట్ ను ధరించి హృతిక్ రోషన్ నటించిన వార్ సినిమాలోని ఘున్గ్రూ పాటకు తన కాలు కదిపారు. హృతిక్ రోషన్ స్టెప్పులను మరిపించేలా రోగుల ఎదుట డ్యాన్స్ వేసిన డాక్టర్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. అరుప్ సేనాపతికి డాన్స్ లో ఏ మాత్రం అనుభవం లేదు. అయినా సరే రోగులలో సంతోషాన్ని నింపేందుకు ఆయన డాన్స్ వేయడం విశేషం.
అరుప్ సేనాపతి డాన్స్ వేస్తున్నపుడు ఆయన స్నేహితుడు వీడియో తీసి ట్విటర్ లో షేర్ చేసాడు. రెండులక్షల పైగా వ్యూస్ సాధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. కరోనా పేషేంట్లను సంతోషపరిచేందుకు డాన్స్ చేసిన డాక్టర్ అరుప్ సేనాపతిని నెటిజన్లు ప్రశంసింస్తున్నారు.