Idream media
Idream media
గవర్నర్ తలుచుకుంటే పాలకవర్గం ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. వారి ఆటలు సాగవని రాజస్థాన్ ఎపిసోడ్ మనకు తెలియజేస్తోంది. ముఖ్యమంత్రి ప్రభుత్వానికి అధినేత అయితే.. ఆ ప్రభుత్వం పాలన సాగించే రాష్ట్రానికి గవర్నరే సుప్రీం అని రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా నిరూపించారు. వీలైనంత త్వరగా అసెంబ్లీ ని సమావేశ పరుచుకుని తన బలాన్ని నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి గెహ్లాత్ విశ్వ ప్రయత్నాలు చేశారు. గవర్నర్ కు విన్నవించారు. బతిమలాడారు. చివరకు ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్ వద్ద భైఠాయించి గవర్నర్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ప్రజలు రాజ్ భవన్ పై దండెత్తితే తమ పూచీ కాదంటూ ఓ రకంగా బెదిరింపులకు కూడా దిగారు. అయినప్పటికీ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. సీఎం వ్యాఖ్యలకు సైతం రాజ్ భవన్ కు సెక్యూరిటీ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం విచారకరమని సుతిమెత్తగా చురకలంటించారు.
చివరకు 21 రోజుల నిబంధన మేరకే..
అనర్హత పిటిషన్‌పై కోర్టు తీర్పు సచిన్ పైలట్ వర్గానికి అనుకూలంగా వచ్చినప్పటి నుంచీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ అసెంబ్లీ వేదికగానే తాడోపేడో తేల్చుకోవాలని ప్రణాళికలు రచించారు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలో అనుమతి కోసం సీఎం ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు సార్లు గవర్నర్ ను కలిశారు. అసెంబ్లీ సెషన్ పెట్టాలంటూ గెహ్లాత్ ఈ నెల 23న ఒకసారి, 25న ఒకసారి గవర్నర్ ను కలిశారు. రెండు సార్లూ వారి ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలించిన ఆయన వాటిని తోసిపుచ్చారు. కరోనా వ్యాప్తి సహా 3 అంశాలను గవర్నర్ లేవనెత్తుతూ, కొత్త ప్రపోజల్ పంపాలని సూచించారు. దీంతో మంగళవారం కేబినెట్ మీటింగ్లో చర్చించి కొత్త ప్రపోజల్ తో గవర్నర్ కు పంపగా.. దానికి కూడా ఆయన నో అన్నారు. తన అభ్యంతరాలకు సరైన వివరణ లేదని తిరస్కరించారు. సమావేశాలకు 21 రోజుల నోటీస్ పీరియడ్ తప్పని సరి అని, ఒక వేళ ముందస్తుగా పెట్టాలని సహేతుకమైన కారణాలు తెలపాలని గవర్నర్ మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. ఓ సందర్భంలో గవర్నర్ పై సీఎం అసహనం వ్యక్తం చేస్తే.. రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకోలేమని, రాజ్యాంగంలోని షెడ్యూల్ ప్రకారం నచుడుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో బుధవారం సీఎం గెహ్లాట్ రాజ్ భవన్ కు వెళ్లిగవర్నర్ మిశ్రాను కలిశారు. మీ పద్ధతి ప్రకారమే గవర్నర్ తో చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయన మొదటి నుంచి అనుకున్న ప్రకారమే 21 రోజుల నోటీస్ పీరియడ్ అనంతరమే రాజస్థాన్ అసెంబ్లీ సమావేశానికి అనుమతి ఇచ్చారు.
ఆగస్టు 14నే అసెంబ్లీ సెషన్..
రాజస్థాన్ అసెంబ్లీని సమావేశపర్చాలంటూ సీఎం అశోక్ గెహ్లాట్ నాలుగో సారి చేసిన ప్రపోజల్ కు గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా బుధవారం రాత్రి ఓకే చె ప్పారు . బుధవారం మధ్యాహ్నం సీఎం గెహ్లాట్ తన ఇంట్లో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఆగస్టు14 నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభించాలంటూ గవర్నర్కు మరోసారి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించి వాటిని గవర్నర్ కు అందజేశారు. గవర్నర్ లేవనెత్తిన 21 రోజుల నోటీస్ పీరియడ్ అప్పటి వరకు పూర్తవడంతో ఆగస్టు 14న అసెంబ్లీ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. చివరకు గవర్నర్ చెప్పిన గడువు వరకూ పాలకవర్గం ఆగక తప్పలేదు.