iDreamPost
android-app
ios-app

బెంగాల్ కు మజ్లీస్ – ఎవరి తలరాతలు మారబోతున్నాయి?

  • Published Nov 13, 2020 | 12:28 PM Updated Updated Nov 13, 2020 | 12:28 PM
బెంగాల్ కు మజ్లీస్ – ఎవరి తలరాతలు మారబోతున్నాయి?

బీహార్‌ విజయం స్ఫూర్తిగా పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ సిద్దం అవుతునట్టు మజ్లిస్‌ పార్టీ అధ్యక్షులు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఒక ప్రకటన విడుదల చేశారు. తమ పార్టీ హైదరాబాద్ కే పరిమితం అని ఎద్దేవా చేసే వాళ్ళకి బీహార్ ఎన్నికలలో తమ గెలుపే సమాధానం అని చెప్పుకొచ్చారు. ఒవైసి ప్రకటించినట్టు మజ్లీస్ పార్టీ బెంగాల్ లో పోటి చేస్తే బీహార్ ఫలితాలు పునరావృతం అవుతాయా ? ఏ ఓట్ బ్యాంక్ మద్దతుతో మజ్లీస్ బెంగాల్ ఎన్నికలపై నమ్మకం పెట్టుకున్నారు అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

2019 ఉప ఎన్నికల్లో కిషన్ గంజ్ స్థానాన్ని గెలిచి బీహార్ లో పాగా వేసిన మజ్లీస్ పార్టీ 2020 ఎన్నికలకు వచ్చేసరికి బీహార్ లోని కిషన్ గంజ్ పార్లమెంటరీ సెగ్మెంట్ లో ఉన్న ఆరు అసెంబ్లీ స్థానాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో (అమోర్, కోచాధామ్, బాయసీ, బహాదుర్‌గంజ్) విజయం సాధించి తన పట్టు నిలుపుకుంది. వీటితో పాటు అరారియా పార్లమెంట్ సెగ్మెంట్ లోని జోకీహాట్ స్థానాన్ని గెలుచుకుంది . దీంతో ముస్లిం జనాభా అధికంగా ఉన్న బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో 24 అసెంబ్లీ సీట్లలో మొత్తం 5 స్థానాల్లో పాగా వేయగలిగింది. మజ్లీస్ గెలిచిన ఆమొర్, బహ్దూర్ గంజ్ స్థానాల్లొ సీనియర్ కాంగ్రెస్ శాసన సభ్యులు ఓటమిపాలవడం విశేషం . కాంగ్రెస్ కు సాప్రదాయబద్దంగా ఉన్న ఓటు బ్యాంకుని తన వైపు తిప్పుకోవడంలో మజ్లీస్ పార్టీ సఫలీకృతం అయింది. ఇక్కడ ఉన్న 24 స్థానాల్లో ఎన్డీఏ 11 స్థానాలు గెలుచుకుంది. దీనికి ముఖ్యకారణం మజ్లీస్ మహాకూటమి ముఖ్యంగా కాంగ్రెస్ ఓట్లను భారీగా చీల్చడం వలనే అనే వాదన ఉంది. మజ్లీస్ ఎన్డీఏ కు బీ టీం గా, ఓట్ కత్వాగా మారిందని కాంగ్రెస్ నాయకులు నేరుగా విమర్శలు కూడా చేశారు.

ఇక 2021లో పచ్చిమ బెంగాల్ లో జరగబోయే ఎన్నికల్లోకి కూడా మజ్లీస్ రావడం ద్వారా ఆ పార్టీ ప్రయోజనం పొందవచ్చనే వాదన బలంగా వినిపిస్తుంది. బీహార్ లో కిషన్ గంజ్ ప్రాంతం బెంగాల్ సరిహద్దు కావడం చేత ఈ ఎన్నికల ప్రభావం బెంగాల్ , బీహార్ సరిహద్దు ప్రాంతాలపై కూడా పడే అవకాశం లేకపోలేదు. దీంతో మరో సారి ఓట్ల చీలికతో బీజేపీకే లాభం చేకూరుతుందనే వాదన ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా 18 స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ ప్రభావం చూపి పాగా వేసేందుకు వ్యుహ రచన చేస్తుంది. ఈ నేపధ్యంలో ఎన్.ఆర్.సీ – సిటిజన్ షిప్ బిల్ తో తీవ్రంగా విభేదిస్తున్న మైనార్టీ వర్గానికి చెందిన వారు సాంప్రదాయ బద్దంగా ఉన్న కాంగ్రెస్ దారిలో వెళ్ళకుండా మజ్లీస్ బాట పడితే ఆ రాష్ట్రంలో కూడా బీహార్ లాంటి ఫలితాలే పునరావృతం అయ్యే అవకాశలు ఉన్నట్టు చెబుతున్నారు. బెంగాల్ లో మజ్లీస్ ప్రయాణం ఎవరి తలరాతలు మార్చబోతుందో వేచి చూడాలి ..