Idream media
Idream media
1968, ప్రజలకి సినిమా తప్ప వేరే వినోదం లేదు. టీవీ ఢిల్లీలో తప్ప ఎక్కడా లేదు. రేడియోలు చాలా ఖరీదు. హోటళ్లలో , డబ్బున్న వారి ఇళ్లలో కరెంట్ రేడియోలు ఉండేవి. ట్రాన్సిస్టర్ రేడియోలు ఎగువ, మధ్యతరగతికే పరిమితం. అవి కూడా వినోదం కాకుండా, ప్రభుత్వ డబ్బా కొడుతుండేవి. పేపర్లు, పత్రికలు చదివే వాళ్లు తక్కువ. కొనేవాళ్లు ఇంకా తక్కువ.
ఇక జనానికి మిగిలింది సినిమా. మరచెంబులో నీళ్లు నింపుకుని వేయించిన శనక్కాయలు, మురుకులు సంచిలో వేసుకుని వెళ్లేవాళ్లు (ఇది కాకుండా థియేటర్లలో కొనే నిమ్మకాడ సోడా అదనం). తెర మీద కథ రెండున్నర నుంచి మూడు గంటలు ఉండాలి. ఆరేడు పాటలుండాలి. ఒక రకంగా ఇవే ఇంటర్వెల్ పాయింట్స్. టీ తాగి , సిగరెట్ కాల్చుకోడానికి పాటలు పనికొచ్చేవి. చాలా థియేటర్లలో ఇంటర్వెల్ అంటూ ప్రత్యేకంగా ఉండేది కాదు. టెంట్లలో సింగిల్ ప్రొజెక్టర్ కాబట్టి రీల్ మార్చినప్పుడల్లా ఇంటర్వెల్లే.
ఉక్కకు మగ్గుతూ, నల్లులతో కుట్టించుకుంటూ , సిగరెట్, బీడీ పొగల మధ్య తన్మయులై జనం చూసేవాళ్లు. వాళ్లకి లాజిక్‌తో పనిలేదు. సినిమా చూసిన తర్వాత వారం రోజులు చుట్టుపక్కల వాళ్లకు కథ చెప్పేవాళ్లు.
ఇలాంటి సందర్భంలో వచ్చిన అసాధ్యుడు సినిమా వాళ్లకి కొత్తగా అనిపించింది. కుటుంబం, ఏడ్పులు, పెడబొబ్బలు లేకుండా ఒక హత్యా ప్రయత్నం నివారించడానికి హీరో కృష్ణ చేసే ప్రయత్నం ఆసక్తిగా అనిపించింది. ఈ సినిమాని ఇప్పుడు చూస్తే పరమ నసగా, తెలివిలేని సినిమాగా బుర్ర తింటుంది.
ప్రతి సంఘటన హీరోకి అనుకూలంగా జరుగుతూ ఉంటుంది. సినిమా అంతా కృష్ణ చేసేది ఏమంటే విలన్ గ్యాంగ్‌కు దొరకడం వాళ్లని తన్ని తప్పించుకోవడం మళ్లీ దొరకడం. మధ్యలో చేస్తున్న పనిమాని కేఆర్ విజయతో పాటలు పాడడం (పాటల్లో కృష్ణ స్టెప్స్, ఎక్స్‌ప్రెషన్స్ మామూలు కామెడీగా ఉండవు).
కథ ఏమంటే, ఒక దివాణం , సహజంగానే దీనికి దుష్టుడైన ఒక దివాన్ ఉంటాడు. అయితే ఈ ఆస్తికి వారసుడు కుమార రాజా (చంద్రమోహన్) ఆయన ఇంగ్లండ్‌లో చదువుకుంటూ విజయ దశమికి ఇంటికొస్తాడు. ఆ రోజు ఆయనకి మైనార్టీ తీరుతుందట. ఆ రోజు ఆయన్ని హత్య చేయాలని దివాన్ ప్లాన్. ఈ దివాన్ (ముక్కామల)కి పూర్తిగా బుర్రలేదు. హత్య చేయడం అసలు చేతకాదు. చేతికి చిక్కిన కృష్ణని ఒకసారి ఒక బుల్లెట్‌తో చంపకుండా డెన్‌లో బందిస్తాడు. హీరోని బందిస్తే ఊరుకుంటాడా? ఎలాగైనా విడిపించుకుంటాడు. నెల్లూరు కాంతారావు (ఈయనే నిర్మాత) లాంటి చవట రౌడీల్ని కాపలా పెడితే కృష్ణ విజృంభించేశాడు. ఆషాడం చీరలు ఒకటి కొంటే నాలుగు ఫ్రీ ఇచ్చినట్టు కృష్ణ ఒకని కొడితే నలుగురు రౌడీలు కిందపడతారు. కృష్ణ చెయ్యి విదిలించక ముందే పల్టీలు కొడతారు. స్టంట్ మాస్టారు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా కృష్ణ పిడికిలి బిగించక ముందే పహిల్వాన్లల్ని నేల మీద దొర్లిస్తాడు.
మళ్లీ కథలోకి వద్దాం. మన దివాన్ హత్యా పథకం ఎలాగో చిన్న దివాన్‌కి తెలుస్తుంది. దాంతో దివాన్ అతన్ని ఫినీష్ చేస్తాడు. తెలివి తక్కువోడు కదా! పూర్తిగా కాకుండా సగమే చంపుతాడు. ఆ చిన్న దివాన్ తన అసిస్టెంట్‌కి కుమార రాజాని విజయ దశమి రోజు చంపుతారని , హంతకుడికి నాలుగు వేళ్లు మాత్రమే ఉన్నాయని బ్రహ్మ రహస్యం చెప్పి చచ్చిపోతాడు. దాంతో అసిస్టెంట్‌ని కూడా దివాన్ ఏసేస్తాడు (ఈ సీన్స్ జరుగుతున్నప్పుడు దివానే విలన్ అని ప్రేక్షకులకి తెలియదు. అది సస్పెన్స్). ఈ సారి కూడా సగమే ఏసి వాన్ని ఆస్పత్రిలో చేరుస్తాడు. వాడు పోతూపోతూ ఆస్పత్రిలో ఒక నర్సు (రమాప్రభ)కి చెప్పి పోతాడు. రమాప్రభని వెంటనే ఫినీష్ చేస్తే కృష్ణ ఎంట్రీ ఉండదు కాబట్టి ఆ రహస్యం అరగంట తర్వాత కృష్ణకి చెప్పే వరకు ఒక ఫైటింగ్, బ్యాంకు దోపిడీతో సాగదీసి ఆమెని రౌడీలు అంతం చేస్తారు.
ఇప్పుడు కృష్ణ నేరుగా దివాణానికి వెళితే మజా ఉండదు. కాబట్టి రెండు గంటల సేపు హీరోయిన్‌తో సరసాలు , రౌడీలతో పోట్లాట ఇవన్నీ సాగిస్తాడు. ఈ రౌడీలు ఎంత గొర్రెలంటే బేడీలు వేయమంటే కృష్ణ చేతికి కేఆర్ విజయ చేతి గాజుకి వేస్తారు, ఆమె తప్పించుకోడానికి వీలుగా.
మధ్యలో ఒక నాటకాల కంపెనీ వాళ్లు తగిలితే కృష్ణ అల్లూరి సీతారామరాజు వేషం వేస్తాడు. ఈ నాటకంలో వాణిశ్రీ డ్యాన్సర్‌గా వేసింది, ఆరేళ్ల తర్వాత 1974లో కృష్ణ అల్లూరి సీతారామారాజు అనే బ్లాక్‌బస్టర్ తీస్తాడని, వాణిశ్రీ తర్వాత రోజుల్లో నెంబర్ వన్ హీరోయిన్ అవుతుందని ఆ రోజుల్లో ఎవరూ ఊహించలేకపోయారు.
లాజిక్ లేని తెలివి తక్కువ సన్నివేశాలతో ఈ సినిమా ఎలాగో ముగుస్తుంది. ఈ సినిమా ఆడడానికి అప్పటికి ఇలాంటి కథ కొత్త కావడం , స్టూడియోలో కాకుండా ఔట్‌డోర్‌లో ఎక్కువ సినిమా ఉండడం, వీఎస్ఆర్ స్వామి ఫొటోగ్రఫీ, కేఆర్ విజయ గ్లామర్ ఇవన్నీ కారణాలు. దీని తర్వాత కృష్ణకి ప్రత్యేక జానర్ ఏర్పడింది. బాల నటిగా రోజారమణి వేసింది. ఇపుడామె కొడుకు తరుణ్ కూడా సినిమాల్లోంచి రిటైర్ అయిపోయాడు.
సినిమాలో ప్రత్యేకంగా కామెడీ లేదు. అది కూడా కృష్ణనే భర్తీ చేస్తాడు.
అర్థం కాని విషయం ఏమంటే విలన్ డెన్‌లో మామూలు తలుపులు కాకుండా మీట నొక్కితే తెరుచుకునేవి ఎందుకుంటాయి? హీరో దొరికినప్పుడు గ్యాస్ ఎందుకు వదులుతారు? అసలా గ్యాస్ ఎలా తయారు చేస్తారు?
కొసమెరుపు ఏమంటే నెల్లూరు కాంతారావు దగ్గర ఒక టోపీ వుంటుంది. అది విసిరితే పెద్దపెద్ద చెట్టు కొమ్మలు కూడా తెగిపోతాయి.
చివర్లో టైంకి కరెక్ట్‌గా ఏ పనీ చేయని విలన్ అనుచరులు టైం బాంబ్‌ని మాత్రం హీరో కోసం కరెక్ట్‌గా ఫిక్స్ చేస్తారు. ఆ కారు ఎక్కి విలన్ పేలిపోతాడు. చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత.
క్రైం సినిమాలకి డైలాగ్‌లు రాయడమే పెద్ద క్రైం అనుకున్నాడేమో ఆరుద్ర (సినిమాలో ఒక సీన్‌లో కనిపిస్తాడు).
మీ మేలు మరిచిపోలేను
సమయానికి దేవుడిలా వచ్చారు
నన్నే అనుమానిస్తున్నారా
ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు
ఈ జగ్గడి దెబ్బంటే అబ్బా అనాలి
ఇలా ముగించేశాడు.