iDreamPost
iDreamPost
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని రాయగఢ్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని విచారణ నిమిత్తం తరలించారు. ఈ అరెస్ట్ ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. రెండేళ్ల క్రితం జరిగిన ఆత్మహత్యల కేసుని గతంలోనే బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మూతవేసింది. కాగా ఇటీవల తిరిగి విచారణ ప్రారంభించిన పోలీసులు, తాజాగా అర్ణబ్ అరెస్ట్ కి పూనుకోవడం చర్చనీయాంశం అవుతోంది.
తనను అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు భౌతికదాడికి పాల్పడ్డారంటూ అర్ణబ్ ఆరోపించారు. తనతో పాటు కుటుంబ సభ్యలపై కూడా దాడి జరిగిందన్నారు. పోలీసులు గోస్వామిని కొట్టారంటూ రిపబ్లిక్ టీవీలో దృశ్యాలు ప్రసారం చేస్తోంది. అదే సమంయలో అర్ణబ్ గోస్వామి అరెస్టు విషయం తెలిసి షాక్‌కు గురయ్యామని ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ఒక ప్రకటనలో చెప్పింది. అయితే అర్ణబ్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేసిన సమయంలో ప్రతిఘటించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో పోలీసులుకు, అర్ణబ్ కి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు కనిపిస్తోంది.
Also Read:దుబ్బాక : ష్.. సైలెన్స్..!
మరోవైపు రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడు అర్ణబ్ గోస్వామిని ఆ చానల్ ముంబై స్టుడియో డిజైన్ చేసిన ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. అరెస్ట్ తర్వాత ఆయన్ని ఓ పోలీస్ వాహనంలో తరలిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
అన్వయ్ నాయక్ 2018లో ఆత్మహత్య చేసుకున్నారు. గోస్వామి తన భర్తకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వలేదని అన్వయ్ భార్య అప్పట్లో ఆరోపించారు. వారి ఆరోపణల తర్వాత కొద్ది కాలానికే అన్వయ్ నాయక్, ఆయన తల్లి అలీబాగ్‌లోని తమ ఇంట్లో 2018 మేలో చనిపోవడంతో వాటికి మరింత బలం చేకూరింది. తన చావుకు కారణం అర్ణబ్ గోస్వామేనంటూ అన్వయ్ లేఖ రాసి చనిపోయారని అన్వయ్ భార్య అప్పట్లో ఆరోపించారు. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఇటీవల ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తూ ఆదేశాలిచ్చారు.
Also Read:పోలవరం ప్రాజెక్ట్ లో చంద్రబాబు 70 శాతం పూర్తి చేశారన్నది నిజమేనా?
అన్వయ్ నాయిక్ భార్య, కూతురు నా దగ్గరకు వచ్చి అర్నబ్ గోస్వామిపై ఫిర్యాదు చేశారని హోం మంత్రి అసెంబ్లీలో వెల్లడించారు. మహారాష్ట్ర పోలీసులు అర్నబ్ గోస్వామికి కేసులో దర్యాప్తు చేస్తారని తెలిపారు. అన్వయ్ నాయిక్ భార్య అక్షతా నాయిక్, కూతురు ప్రజ్ఞా నాయిక్ ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. దానికి అనుగుణంగానే కేసు విచారణలో భాగంగా రాయగఢ్ పోలీసులు రంగంలో దిగినట్టు కనిపిస్తోంది.
ఇప్పటికే అర్ణబ్ , మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య పలు వివాదాలు తెరమీదకు వస్తున్నాయి. ఇటీవల బార్క్ రేటింగ్స్ వివాదంలో కూడా మహారాష్ట్ర పోలీసులు అర్ణబ్ అరెస్ట్ కి నోటీసులు ఇచ్చారు. అయితే ముందస్తు బెయిల్ తో విచారణకు హాజరవుతున్నారు అర్ణబ్. ఈ నేపథ్యంలో పాత కేసు మరోసారి తెరమీదకు తీసుకురావడాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఖండించారు. కంగనా రనౌత్ కూడా పోలీసుల తీరుని నిరసించారు. అయితే సంజయ్ రౌత్ మాత్రం ఆరోపణలు ఖండించారు. పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరించారని తెలిపారు. ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు.