iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డ మీటింగ్ కి హాజరయిన అన్నా డీఎంకే, ఫార్వర్డ్ బ్లాక్, జేడీయూ వంటి పార్టీలు

  • Published Oct 28, 2020 | 8:58 AM Updated Updated Oct 28, 2020 | 8:58 AM
నిమ్మగడ్డ మీటింగ్ కి హాజరయిన అన్నా డీఎంకే, ఫార్వర్డ్ బ్లాక్, జేడీయూ వంటి పార్టీలు

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నాహాలు షురూ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ పార్టీలతో భేటీ అయ్యింది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సమావేశానికి మొత్తం 19 పార్టీలను ఆహ్వానించారు. కాగా అందులో 11 మాత్రమే హాజరయినట్టు అధికారిక ప్రకటనలో తెలిపారు. ఆసక్తికరంగా ఈ సమావేశానికి వచ్చిన పార్టీలను గుర్తిస్తే తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నా డీఎంకే, బెంగాల్ లో కొంత ప్రభావం చూపించే ఫార్వర్డ్ బ్లాక్, బీహార్ లో ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న జేడీయూ వంటి పార్టీలుండడం విస్మయకరంగా కనిపిస్తోంది. ఇక కేరళలో మాత్రమే కనిపించే ఇండియన్ ముస్లీంలీగ్ ప్రతినిధులు సమావేశానికి వచ్చినట్టు ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్ లో ప్రభావం చూపించే సమాజ్ వాదీ పార్టీతో పాటుగా ప్రస్తుతం అధికారం కోల్పోయిన బీఎస్పీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. వాటితో పాటుగా ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తో పాటుగా జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ప్రతినిధులు కూడా ఎస్ఈసీ తో భేటీకి హాజరయ్యారు.

ఇక కేవలం కర్ణాటకలో మాత్రమే ప్రభావం చూపించే జనతాదళ్ సెక్యులర్ పార్టీ తమ వైఖరిని రాతపూర్వకంగా వెల్లడించినట్టు ఎస్ఈసీ ప్రకటించింది. వారితో పాటుగా జనసేన కూడా సమావేశానికి దూరమయ్యింది. కానీ కేవలం రాతపూర్వకంగానే తమ అభిప్రాయం వెల్లడించినట్టుగా చెబుతున్నారు. ఈ సమావేశానికి దూరమయిన ఆ రెండు పార్టీలతో పాటుగా మరో ఆరు పార్టీలు తమ అభిప్రాయాలను కూడా వెల్లడించలేదు. అందులో ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ కూడా ఉంది. తాము హాజరుకావడం లేదని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆపార్టీ దూరంగా ఉండడం పెద్ద ఆశ్చర్యం లేదు. గానీ టీఆర్ఎస్, ఎంఐఎం, ఎన్సీపీ, ఆర్ఎల్డీ, ఆర్సీపీలను కూడా సమావేశానికి పిలవగా వారు కూడా దూరంగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల విషయంలో బీహార్, కర్ణాటక, యూపీ, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కొద్ది మేర మాత్రమే ప్రభావం చూపే పార్టీలను ఆహ్వానించడమే ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. ప్రధాన పార్టీలలో వైఎస్సార్పీపీ కి తోడుగా జనసేన కూడా తన ప్రతినిధిని పంపించకపోవడం విశేషం కాగా అన్నాడీఎంకే, ముస్లీంలీగ్ వంటి పార్టీలతో సాగించిన చర్చల సారం పై పలువురు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి సమావేశాల ద్వారా ఒరిగేదేమీ ఉండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఎస్ఈసీ మాత్రం తాము ఏపీ వైద్య ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రకటించింది.