iDreamPost
android-app
ios-app

Tdp, Yellow Media, Employees Unions – టీడీపీ, పచ్చ మీడియా కలిసి ఉద్యోగ సంఘాలను వాడుకోవాలని చూస్తున్నాయా..?

  • Published Dec 06, 2021 | 8:29 AM Updated Updated Dec 06, 2021 | 8:29 AM
Tdp, Yellow Media, Employees Unions – టీడీపీ, పచ్చ మీడియా కలిసి ఉద్యోగ సంఘాలను వాడుకోవాలని చూస్తున్నాయా..?

జగన్ ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్న ఓ వర్గం మీడియా అన్నింటినీ భూతద్దంలో చూపెట్టే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో చంద్రబాబు సైతం వాస్తవాలను వక్రీకరించి విషం జల్లేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు ఉద్యోగులు కూడా మినహాయింపు కాదు. దానికి తాజా ఉదాహరణ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి శ్రీనివాసరావు వ్యాఖ్యలను చిత్రీకరించిన తీరుని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయసంఘాల జేఏసీ నేతగా ఆయన ఉన్నారు. పీఆర్సీ సహా వివిధ సమస్యలకు సంబంధించి అంతర్గత సమావేశంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇటీవల వైరల్ అయ్యాయి. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నట్టు, తామే అధికారంలోకి తీసుకురాగలం, లేదా తొలగించగలం అన్నట్టుగా ఆయన హెచ్చరించారనే అర్థంలో వీడియో విస్తృతంగా ప్రచారమయ్యింది.

నిజానికి ఉద్యోగ, కార్మిక సంఘాల్లో ఇలాంటి హెచ్చరికలు కొత్త కాదు. తమ శ్రేణులను ఉత్సాహపరిచే రీతిలో నాయకులు ఇంతకన్నా తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. చంద్రబాబు వంటి వారిని గద్దె దింపుతామని హెచ్చరించిన అనుభవం కూడా ఉంది. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామని, ఇంటికి పంపుతామని ఇలా రకరకాలుగా హెచ్చరికలు జారీ చేసిన చరిత్ర ఉంది. అయితే తాజాగా ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కామెంట్స్ కి మాత్రం ప్రాధాన్యతనిచ్చి పచ్చ మీడియా దానిని ప్రసారం చేసింది. హెడ్ లైన్స్ లో ప్రచురించి హడావిడి చేశాయి. వాస్తవానికి తిరుపతిలో సీఎం ప్రకటన తర్వాత ఉద్యోగులు కాస్త శాంతించారు. తమకు పీఆర్సీ ప్రకటన వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల కార్యచరణకు స్పందన నామమాత్రంగా కనిపిస్తోంది. దానిని కప్పిపుచ్చేందుకు ఆ సంఘం నేతలు కొంత ఉద్రేకంగా మాట్లాడారు.

Also Read : CM Jagan, PRC – ఉద్యోగులకు సీఎం జగన్‌ తీపి కబురు

తమ మాటలు పట్టుకుని కొన్ని పత్రికలు ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య వైరుధ్యం పెంచే ప్రయత్నం చేస్తున్నాయని ఎన్జీవో నాయకుడు శ్రీనివాసరావు వ్యాఖ్యానించడం విశేషంగా మారింది. ఆ వ్యాఖ్యలను బూతద్దంలో చూపించి తమ పార్టీ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని ఆయన వాపోయారు. పత్రికలు కొన్ని టీడీపీ బాకాలుగా మారాయని విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి కోమ్ముకాస్తూ ప్రభుత్వం మీద బురదజల్లేందుకు చూస్తున్నాయన్నారు. తాము ప్రభుత్వ పక్షం అని, తమకు ఉద్యోగ సంఘాలు ముఖ్యమని వ్యాఖ్యానించారు. తమన వ్యాఖ్యల్లో రాజకీయ కోణం లేకపోయినా వక్రీకరించారని వాపోయారు. తనకు పార్టీలు అంటగట్టొద్దని, తాను ఎవరికీ తొత్తు కాదని ఆయన వివరించారు. తమకు లేని రాజకీయాలు ఆపాదిస్తూ, తమ ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే సహించబోమని కూడా ఎన్జీవో నేత స్పస్టం చేశారు.

ఇప్పుడీ ఎన్జీవో నేత మాటలు టీడీపీ వర్గాలకు మింగుడుపడని రీతిలో మారాయి. ఉద్యోగ సంఘాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తుంటే ఇలా అడ్డం తిరగడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పచ్చ బ్యాచ్ మారింది. ముఖ్యంగా ఎన్జీవో నేతలుగా ఉన్న అశోక్ బాబు అనుచరులు కొందరు ఈ పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా బండిశ్రీనివాసరావు తమ వైపు ఉంటారనుకుంటే ఇలా ప్రభుత్వ తీరుతో సంతృప్తి చెందినట్టుగా మాట్లాడడాన్ని వారు సహించలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఏమయినప్పటికీ రాజకీయంగా జగన్ ని ఎదుర్కోవడం కోసం అన్ని వర్గాలను వాడుకుంటున్న చంద్రబాబు నైజం మాత్రం మరోసారి బయటపడింది. ఎన్జీవో నేతల తీరుతో టీడీపీ అధినేతకు దాదాపు తలబొప్పికట్టినంత పనయ్యింది.

Also Read : Jagan, PRC, Govt. Employees – ఉద్యోగుల సమస్యపై సీఎం సానుకూల స్పందన, అయినా ఎన్జీవో నేతల ఉక్రోశం ఏమిటీ..?