iDreamPost
android-app
ios-app

శివసేన,బీజేపీ మధ్య మళ్లీ స్నేహ సంకేతాలు…

  • Published Sep 19, 2021 | 1:36 AM Updated Updated Mar 11, 2022 | 10:42 PM
శివసేన,బీజేపీ మధ్య మళ్లీ స్నేహ సంకేతాలు…

సీఎం పదవి విషయంలో అభిప్రాయ భేదాలతో రెండేళ్ల క్రితం వాడిపోయిన బీజేపీ శివసేనల స్నేహ సుమం మళ్లీ చిగురిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. విడిపోయినప్పటి నుంచీ ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈ రెండు పార్టీల మధ్య అంతరం మరింత పెరిగింది. అయితే కొద్దిరోజులుగా శివసేన నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, ప్రకటనలు మాజీ మిత్రుల మధ్య వారధి కడుతున్నాయి. ఔరంగాబాదులో పాల్గొన్న ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలు, బీజేపీపై నిత్యం విరుచుకుపడే ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మోదీని ఆకాశానికి ఎత్తేయడం.. మళ్లీ ఆ రెండు పార్టీలు దగ్గరవుతున్నాయన్న చర్చలకు ఆస్కారం ఇస్తున్నాయి.

థాక్రే వ్యాఖ్యలపై చర్చ

ఔరంగాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఉద్ధవ్ థాక్రే అదే కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి రావు సాహెబ్ దన్వేను ఉద్దేశించి భవిష్యత్తు సహచరుడు అని సంబోధించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ముంబై-నాగపూర్ బుల్లెట్ రైలు వేస్తే ‘మీతోనే ఉంటాను..మీతోనే ప్రయాణిస్తాను’ అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.దీనికి రైల్వే మంత్రి స్పందిస్తూ శివసేన, బీజేపీ కలిసి పనిచేస్తే ఓటర్లు సంతోషిస్తారన్నారు. వీరిద్దరి వ్యాఖ్యలపైనే రాష్ట్ర రాజకీయవర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

కాగా అవకాశం వస్తే చాలు బీజేపీపై విరుచుకుపడే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సైతం రూటు మార్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ జన్మదినం సందర్బంగా దేశంలో ప్రస్తుతం మోదీ అంతటి నాయకుడు లేడని అన్నారు. వాజపేయి తర్వాత మోదీ బీజేపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారంటూ ఆకాశానికి ఎత్తేశారు.

రెండు పార్టీల్లో ఆనందం

మూడు దశాబ్దాలుగా కలిసున్న బీజేపీ, శివసేనలు 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం పదవి ఎవరు చేపట్టాలన్న అంశంపై ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. అదే ఆ రెండు పార్టీల మైత్రిని దెబ్బ తీసింది. దాంతో శివసేన పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఉద్ధవ్ థాక్రే సీఎంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆనాటి నుంచి సేన, బీజేపీల మధ్య అంతరం పెరిగింది. ఈ తరుణంలో రెండు పార్టీల మధ్య మళ్లీ మాటలు కలుస్తుండటం, స్నేహ సంకేతాలు అందుతుండటంపై ఇటు సేన, అటు బీజేపీ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

తాజా పరిణామాలపై మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను ఆహ్వానిస్తున్నానని, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని వ్యాఖ్యానించారు. అలాగే శివసేన నేత, రాష్ట్ర మంత్రి అబ్దుల్ సత్తార్ స్పందిస్తూ రెండు పార్టీలు కలిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సమన్వయం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు.