iDreamPost
iDreamPost
దేశంలో ఈ ఏడాది మే 2 తర్వాత వరుసగా పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ ధరల్లో నిత్యం ఎంతో కొంత పెరుగుతూనే వచ్చింది. ఇది ఎప్పటి వరకూ అంటే మొన్నటి నవంబర్ 2న వచ్చిన ఉప ఎన్నికల ఫలితాల వరకూ. అంటే ఏప్రిల్ నెలాఖరున జరిగిన కీలక రాష్ట్రాల ఎన్నికల వరకూ స్థిరంగా ఉన్న ధరలు హఠాత్తుగా మే మొదటి వారం నుంచి పెరగడం మొదలయ్యింది. మళ్లీ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి చెంప దెబ్బ తగిలే వరకూ ఈ ధరల మంట కొనసాగింది. చివరకు సామాన్యుడు ఈ ధరల భారాన్ని సహించలేమంటూ ఓటుతో ప్రభుత్వానికి చెమటలు పట్టించిన పుణ్యాన ఒక్కసారిగా ధరలు తగ్గుముఖం పట్టాయి.ఈ ధరలు మళ్లీ యూపీ ఎన్నికల తర్వాత ఇలానే ఉంటాయనే ధీమా లేదు.ఎందుకంటే కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి యూపీ కీలకం కాబట్టి ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పట్టించి,ప్రజలను శాంతింపజేసినట్టు స్పష్టమవుతోంది.
ఇది ఈ ఆరు నెలల అనుభవం మాత్రమే కాదు.గతాన్ని గమనిస్తే పెట్రోల్ ధరలకు ఎన్నికలకు ఉన్న అనుబంధం రూఢీ అవుతోంది. గడిచిన నాలుగేళ్లుగా ఇదే తంతు సాగడం దానికి ఆధారం. ఉదాహరణకు 2017 ఏప్రిల్‌లో యూపీ, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకు ముందు వరుసగా మూడు నెలల పాటు పెట్రోల్ ధరల్లో పెరుగుదల ఆగిపోయింది. కానీ ఆనాడు యూపీ,ఉత్తరాఖండ్ సహా కీలక రాష్ట్రాల్లో బీజేపీ పట్టు సాధించడంతో మళ్లీ పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయి.సరిగ్గా ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ధరలు పెరగడం మొదలుకావడం విశేషం. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్‌లో గుజరాత్ ఎన్నికల ముంగిట కూడా ఇదే తీరు. 2017 అక్టోబర్, నవంబర్ మాసాల్లో అంతర్జాతీయంగా ధరలు పెరిగినా ఇండియాలో మాత్రం ధరలు పెరగలేదు. పైగా డిసెంబర్‌లో కొద్ది మేరకు తగ్గుదల కూడా కనిపించింది. అంటే ఎన్నికలుంటేనే పెట్రోల్ ధరలు దారిలో కొస్తున్నట్టు కనిపిస్తోంది.
2018లో కర్ణాటక సహా పలు రాష్ట్రాల ఎన్నికల సమయంలోనూ, 2019 సాధారణ ఎన్నికల వేళ కూడా ఇదే జరిగింది. ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు పెట్రోల్ ధరల పెరుగుదల ఆగిపోవడం, ఫలితాలు వచ్చిన వెంటనే మళ్లీ పెరుగుదల నమోదు కావడం సాధారణంగా మారుతోంది. గత ఏడాది బీహార్ ఎన్నికల ముంగిట కూడా అదే ధోరణి. దాంతో ప్రస్తుతం యూపీ,పంజాబ్,ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ ధరల నియంత్రణకు కేంద్రం సిద్ధమయినట్టు కనిపిస్తోంది. మే నెలలో జరిగిన బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల ఎన్నికల్లో ఖంగుతినడం, మొన్నటి ఉప ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లో తుడిచిపెట్టుకుపోవడం, రాజస్తాన్‌లో ఒక చోట ఏకంగా మూడోస్థానానికి పరిమితం కావడం వంటి ఫలితాల నేపథ్యంలో బీజేపీ పెద్దలు కళ్లు తెరిచినట్టు కనిపిస్తోంది.
ఇటీవల కేంద్రం తగ్గించిన ఎక్సైజ్ సుంకాల మూలంగా ప్రభుత్వానికి ఏకంగా లక్ష కోట్ల రూపాయాల ఆదాయం తగ్గుతుంది. దానికి మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ ధరలు పెంచడానికి సిద్ధం కాబోరనే గ్యారంటీ కనిపించడం లేదు. ముఖ్యంగా యూపీలో పట్టు కోల్పోకూడదని భావిస్తున్నందునే మోదీ ప్రభుత్వం భారీగా ధరలు తగ్గించడానికి సిద్ధమయ్యిందనే అభిప్రాయాన్ని 2017 నుంచి జరుగుతున్న ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ నేతలు ధరల మీద ధర్నాలు చేయడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. తమ రాష్ట్రాల్లో ఎన్నికలున్నందున ధరలు తగ్గించి, దేశంలో అందరూ అదే పనిచేయాలని అడగడం వారి వింత వైఖరిని చాటుతోంది.
Also Read : Pakisthan Ex Soldier Sajjad Ali Zahir, Padma Shri – పాక్ మాజీ సైనికుడికి పద్మశ్రీ పురస్కారం.. ఎందుకో తెలుసా?