మా అబ్బాయి చదువు కోసం బ్యాంక్ లోన్‌కు వెళితే నలుగురు గవర్నమెంట్ ఉద్యోగుల షూరిటీ అడిగి, వంద కాగితాల్లో సంతకాలు పెట్టించుకున్నారు. రుణాల సక్రమ వసూళ్లకి బ్యాంకులు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం తప్పు కాదు.
ఒక రైతు లోన్ కోసం వెళితే ఎన్ని ముప్పుతిప్పలు పెడతారో అందరికీ తెలుసు. ఒకవేళ అతను సకాలంలో చెల్లించకపోతే జరిగే అవమానం కూడా తెలుసు. అయితే విచిత్రం ఏమంటే దేశంలో రోజురోజుకి బ్యాంక్ సిబ్బంది, మోసగాళ్లతో కుమ్మక్కై చేస్తున్న మోసాలు పెరిగిపోతున్నాయి. సాక్ష్యాత్తూ రిజర్వ్ బ్యాంకే తన వార్షిక నివేదికలో చెప్పిన విషయం ఇది.
2018-19లో 71,542 కోట్ల రూపాయలు మోసం జరిగితే 6801 కేసులు నమోదు చేశారు. 174 మంది బ్యాంక్ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. దీంట్లో 60 మంది SBI ఉద్యోగులున్నారు.
రిజర్వ్ బ్యాంక్ గట్టిగా ఆదేశించిన తర్వాత కూడా మోసాలను గుర్తించడానికి 22 నెలలు పట్టింది. 2018 నాటికి బ్యాంకుల రుణ బకాయిలు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీంట్లో రూ.లక్ష లోపు రుణాలు 0.1 శాతం మాత్రమే. అంతా బడా బాబులు ఎగ్గొట్టినవే. సామాన్యులు పైసా పైసా కూడబెట్టి దాచుకున్న డబ్బుని బ్యాంకులు మోసగాళ్లకి రుణాలుగా ఇస్తున్నాయి. దాంతో దివాళా తీస్తున్నాయి. వాటిని ఆదుకోడానికి రూ.70 వేల కోట్లు కేంద్రం ఇస్తోంది.
ఈ నష్టాలని పూడ్చుకోడానికి బ్యాంకులు , మనకు దొంగదారిలో వడ్డిస్తున్నాయి. ఒకప్పుడు ఉచితంగా జరిగే సర్వీస్ లన్నింటికి ఇప్పుడు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే రూపాయి విలువ పడిపోతూ ఉంది. బ్యాంకులపైన కూడా నమ్మకం పోతే అప్పుడు అసలైన ఆర్థిక మాంద్యం ప్రారంభమవుతుంది.
ఒక వైపు దేశంలో ఆర్థిక పతనం జరుగుతూ ఉంటే బీజేపీ ప్రభుత్వం హిందుత్వ గూండాలని అమాయక విద్యార్థులపైకి ఉసిగొలిపే పనిలో ఉంది.
3725