పై ఫొటోలో విజయవాడ రైల్వే జంక్షన్ లో సాధారణ ప్రయాణికుల్లా కూర్చున్న ఆ దంపతులను గుర్తు పట్టారా? గతంలో ఎప్పుడైనా వారిని చూసినట్లు అనిపిస్తుందా? ఆవిడ మరెవరో కాదు. అత్యంత పిన్న వయసులో ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కాగా ఆవిడతో ఉన్న వ్యక్తి ఆమె భర్త శివప్రసాద్. సాధారణ ప్రయాణికుల్లా విజయవాడ రైల్వే జంక్షన్ లో కూర్చుని ఉంటే ఎవరో క్లిక్ మనిపించారు.
అరకు నుండి వైసీపీ తరపున పోటీ చేసి అంఖండ మెజార్టీతో గెలిచిన గొడ్డేటి మాధవి మొదటినుండి సాధారణ జీవితాన్ని గడపడానికే మొగ్గు చూపుతారు. తానొక ప్రజాప్రతినిధి హోదాలో ఉన్నా సరే ఆ గర్వాన్ని ఆమె ఎప్పుడూ చూపించలేదు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెంకు గొడ్డేటి మాధవి స్వగ్రామం కాగా కమ్యూనిస్టు నేత అయిన గొడ్డేటి దేముడు ఆమె తండ్రి. దేముడు రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు కానీ ఆస్తులు కూడగట్టలేదు. తల్లి చెల్లయమ్మ ఎస్జీటీగా పని చేస్తున్నారు. చిన్ననాటి నుండి గిరిజనుల కష్టాలను చూస్తూ పెరిగిన మాధవి బీఎస్సీ బీఈడీ పూర్తి చేసి మాధవి గిరిజన పాఠశాలలో పీడీ టీచర్‌గా పనిచేశారు.
కాగా ఓ సంఘటన తనను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రభావితం చేసిందని మాధవి పలు సందర్భాల్లో చెప్పారు.గతంలో తాను పనిచేస్తున్న ఓ స్కూలులో ఒక విద్యార్థినికి ఆరోగ్యం పాడైతే పాడేరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యులు చిన్నారికి వైద్యం అందించలేదని, ఐటీడీఏకు ఫిర్యాదు చేసినప్పటికీ లాభం లేకుండా పోయిందన్నారు. అప్పుడే తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన వచ్చిందని తన తండ్రిలాగా తాను కూడా ఒక ప్రజాప్రతినిధి అయితే ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఉంటుందని భావించి జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీలో చేరారు.
తండ్రి వారసత్వంగా తొలిసారిగా రాజకీయాల్లో వచ్చిన మాధవికి అరకు లోక్‌సభ నియోజకవర్గంలో సుదీర్ఘ అనుభవం ఉన్న కిషోర్ చంద్రదేవ్ ప్రత్యర్థిగా నిలవడంతో ఆమె గెలవడం కష్టమే అని చాలా మంది అనుకున్నారు. కానీ చింతపల్లి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడుకి ఉన్న మంచి పేరుతో పాటు బలమైన కొండదొర సామాజిక వర్గానికి వ్యక్తి కావడంతో గిరి పుత్రులు ఆమెపై నమ్మకం ఉంచారు. రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో కిషోర్ చంద్రదేవ్ పై 2లక్షల 21వేల ఓట్ల భారీ మెజార్టీతో గొడ్డేటి మాధవి విజయం సాధించారు. తద్వారా 25 ఏళ్ల మూడు నెలల పిన్న వయసులో లోక్‌సభలో అడుగుపెట్టిన వ్యక్తిగా గొడ్డేటి మాధవి నిలిచారు.
అత్యధిక మెజారిటీతో విజయం సాధించినా సరే ఆమె విజయాన్ని నెత్తికెక్కించుకోలేదు. ఓసారి గొడ్డేటి మాధవి అరక పట్టి దుక్కి దున్నుతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఎంపీ అయినా కూడా కుటుంబ జీవనాధారమైన వ్యవసాయ పనులు చేశారు. తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే గుడి దేవుడు ద్వారా సంక్రమించిన పొలంలో దుక్కి దున్ని విత్తనాలు జల్లారు. ప్రజా ప్రతినిధి అనగానే సెక్యూరిటీతో ముందస్తు నాలుగైదు కార్లతో హడావిడి చేయడం ఆమెకు ఇష్టం ఉండదు. సాధారణ జీవితం గడపడానికే ఆమె ఇష్టపడుతుంది.
తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి, స్నేహితుడు శివప్రసాద్‌ను మాధవి వివాహం చేసుకున్నారు. తన విజయంలో తన భర్త పాత్ర ఎంతో ఉందని ఆమె చెబుతూ ఉంటారు. అధికారం రాగానే గర్వం తలకెక్కే రోజుల్లో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా,సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడుతూ, గిరిపుత్రులకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడానికి మొగ్గు చూపే ఎంపీ మాధవి జీవితం ప్రజలకు మాత్రమే కాకుండా పలువురు ప్రజా ప్రతినిధులకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు..