కరోనా కారణంగా ఏర్పడిన గందరగోళ పరిస్థితి వల్ల తీవ్ర నష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు తన ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ఆర్టీసీలో ఉన్న పాత బస్సులను సరకు రవాణా చేసే వహనాలుగా మార్చే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కార్గో రవాణాపై దృష్టి సారించింది.
స్థానిక వ్యాపారులు మరియు రైతుల నుండి సరకుల రవాణా ద్వారా కొంత ఆదాయాన్ని సంపాదించడానికి ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. వస్తువులు రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా రవాణా చేయబడతాయి మరియు ఛార్జీలు రవాణా చేసే వస్తువులు/సరకుల టన్నులు మరియు దూరాన్ని బట్టి ఉంటాయి.
ఆర్టీసీ తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా ఆర్టీసీకి వాణిజ్య ప్రయోజనాలు కలగడమే కాకుండా రైతులకు వ్యాపారులకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఆర్టీసీ ఏర్పాటు చేయనున్న కార్గో వాహనాల ద్వారా కూరగాయలు, మందులు మరియు అనేక ఇతర ఉత్పత్తులను రవాణా చేయవచ్చు.
ప్రస్తుతం నిమ్మకాయలు, కూరగాయలు, మామిడి, మందులు, కిరాణా, మరియు ఇతర ఉత్పత్తులును లోడ్లు బుక్ చేసుకోవాలని ఆర్టీసీ సిబ్బంది యోచిస్తున్నారు. ఏది ఏమైనా కరోనా కారణంగా కుంటుపడిన ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి పాత బస్సులను కార్గో వాహనాలుగా మార్చి సరకులను రవాణా చేయడం ద్వారా గాడిలో పెట్టాలని యోచిస్తున్న ఆర్టీసీ నిర్ణయాన్ని స్వాగతించాలి. దీనిద్వారా రైతులు,వ్యాపారులపై భారం తగ్గడంతో పాటు సరకు రవాణాలో పెను మార్పులు వస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు..