గోదావరి, కృష్ణ, పెన్నా నదులకు వచ్చిన వరద నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ఇసుక కొరత సమస్య క్రమంగా తగ్గుతోంది. వరదలు తగ్గుముఖం పట్టడం తో రిచ్ ల్లో ఇసుక తీసేందుకు అవకాశం ఏర్పడుతోంది. తాజాగా వర్షాకాలం ముగియడం, వరదలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఇసుక తవ్వకాలు వేగవంతం చేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 85,122 టన్నులు, శుక్రవారం 86,482 టన్నుల ఇసుకను తీశారు. పాత నిల్వలు కలుపుకొని రోజుకు 96వేల టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇసుక కొరత సమస్య నెలకొనడం ఇదే తొలిసారి కాదు. టీడీపీ 5 ఎల్లా పాలనలో వర్షాలు లేకపోవడం తో గోదావరి మినహా మరే ఇతర నదుల్లో వరద ఊసే లేదు. గోదావరి నదికి ఆంధ్రప్రదేశ్ లో వర్షాలతో సంభందం లేకుండా వరద వస్తుంది. జులై నుంచి అక్టోబర్ వరకు వరద ఉంటుంది. వరద ఎక్కువగా ఉన్న సమయంలో ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని రిచ్ లు మూతపడతాయి. ఆ సమయంలో గోదావరి నది గ్రామాల్లో కూడా నిర్మాణాలు సాగవు.
వైఎస్సార్ సిపి ప్రభుత్వం వచ్చాక వరదల వల్ల సమస్య వెలుగులోకి వచ్చినా.. అంతకు ముందే టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమాలు, మాఫియా పై రాష్ట్ర హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులతో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. జగన్ సర్కారు ప్రజా రంజక పాలనతో ప్రభుత్వంపై దాడి చేసేందుకు ఏ అవకాశం లేని సమయంలో ప్రతిపక్ష పార్టీ టిడిపికి ఇసుక కొరత ఒక అస్త్రంగా దొరికింది.
ఇసుక కొరత ఇప్పుడే వచ్చినట్లు, ప్రభుత్వం పరిష్కరించడం లేదని ప్రతి పక్ష పార్టీలు దీన్ని రాజకీయం చేసాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే నదుల్లో వరద ప్రవాహం ఉండటం వల్లే ఇసుక సరఫరా చేయలేకపోతున్నామని, ఈ విషయంలో ప్రతిపక్షాల విమర్శలు అర్ధరహితమని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. రోజుల వ్యవధి లోనే సమస్య పూర్తిగా కొలిక్కి వస్తుందని సీఎం జగన్ చెప్పారు. ప్రభుత్వ అంచనకు అనుగుణంగా ప్రస్తుతం వరద తగ్గడం, ఇసుక లభ్యత రోజు రోజుకు పెరుగుతోంది. రీచుల్లో తవ్వకాలు పెరగడంతో ఎక్కువ ఇసుక అందుబాటులోకి వస్తోంది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఇసుక సరఫరా క్రమంగా పెంచుతోంది.
వారం పది రోజుల వ్యవధి లోనే అన్ని రిచ్ లు మునుపటి లాగే యధాతధంగా పని చేసే అవకాశం ఉంది. ఇసుక కొరత ఉండదు. అప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతి పక్షాలకు కొత్త అస్త్రం కావాలి. ఎవరు వేలెత్తి చూపెందుకు అవకాశం ఇవ్వకుండా జగన్ సర్కారు పాలన సాగిస్తున్నారు. పాలనలో లోపాలు లేకపోవడం తో ప్రతిపక్షాలకు ఇసుక లాంటి మరో సహజ సిద్దమైన సమస్య దొరికే వరకు ఏమి చేస్తారో… చూడాలి.