iDreamPost
iDreamPost
సహజంగా అసెంబ్లీ సమావేశాలకు అధికార పక్షం వెనకాడుతుంది. విపక్షం డిమాండ్ చేస్తుంది. కానీ ఏపీలో పూర్తి రివర్స్. ఏపీలో సమావేశాల నిర్వహణకు సర్కారు చొరవ చూపుతోంది. ప్రతిపక్షం మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులకు ఇది తార్కాణంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎంత పీకల్లోతు కష్టాల్లో ఉందన్నది స్పష్టం చేస్తుంది. అసెంబ్లీ సమావేశాలనగానే చకచకా సన్నద్ధం కావాల్సిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏమాత్రం ఉత్సాహం లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతకే ఈ సమావేశాలు పూర్తి సమ్మతం కాని నేపథ్యంలో సాధారణ సభ్యులు అందుకు భిన్నంగా ఉంటారని ఆశించలేం.
కరోనాకి వ్యాక్సిన్ వచ్చే వరకూ తాను ప్రజల్లోకి రాలేనని ఇప్పటికే చంద్రబాబు తేల్చేశారు. దాని కోసం ఆయన ఎదురుచూస్తూ ఎక్కువ సమయమంతా హైదరాబాద్ లోనే గడుపుతున్నారు. కేవలం జూమ్ సమావేశాలకే పరిమితమవుతున్నారు. చివరకు టీడీఎల్పీ మీటింగ్ కూడా ఆయన జూమ్ లోనే నిర్వహించారు. కానీ తీరా చూస్తే పలువురు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి ఢుమ్మా కొట్టడం చూస్తుంటే టీడీపీ నేతల్లో నైరాశ్యం తీవ్రమవుతున్నట్టు కనిపిస్తోంది. అధినేత మీద విశ్వాసం సన్నగిల్లుతుండడం, ఏపీలో పార్టీ కోలుకుంటుందనే నమ్మకం తగ్గుతుండడంతో చాలామంది ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోతున్నట్టు కనిపిస్తోంది. చివరకు ఎమ్మెల్యేల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో తిరుపతి ఉప ఎన్నికలకు కూడా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ బాధ్యతలను పలువురు ద్వితీయ శ్రేణి నేతలకు అప్పగించడం టీడీపీ పరిస్థితిని చాటిచెబుతోంది.
ఆన్ లైన్ లో జరిగిన టిడిఎల్ పి సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వారు కూడా సభలో వ్యూహం విషయంలో ఆసక్తి లేకపోవడం టీడీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఓవైపు పాలకపక్షం దూకుడుగా ఉంది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. ఇప్పటికే నలుగురు నారా బాబుకి నైనై చెప్పేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సందిగ్ధంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో అసెంబ్లీ వేదికగా పాలకపక్షాన్ని ఢీకొట్టడం పెద్ద సమస్యగా మారుతోంది. సభలో ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతే ప్రజల్లో మరింత పలుచనవుతామనే ఆందోళన కూడా ఉంది. ఇప్పటి వరకూ సభలో ఏదో మేరకు దూకుడుగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు ఇటీవల అరెస్ట్ అయ్యి విడుదలయ్యారు. దాంతో ఆయనకు ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టినా సభలో ఆయనకు చిక్కులు తప్పవని తెలుస్తోంది. ఇక బుచ్చయ్య చౌదరి సహా నోరున్న నేతలంతా ఏమేరకు అధికార పార్టీని అడ్డుకోగలరన్నది సందేహంగా కనిపిస్తోంది.
చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ సభలో వైఎస్సార్సీపీని ఎదుర్కోవడం ఇప్పుడు తలకుమించిన భారంగా మారుతోంది. దాంతో గతంలో ఎన్నడూ లేని ఇంతటి సంక్లిష్ట స్థితి నుంచి పార్టీని గట్టెక్కించడం బాబుకి కూడా తలకుమించిన భారం అవుతోంది. దాంతో ఈసారి సభలో పేలవంగా చేతులెత్తే పరిస్థితి కొనసాగుతుందా లేక అధికార పార్టీకి ఏదో మేరకు అడ్డుకట్ట వేస్తారా అన్నది ఆసక్తికరమే.