Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వివాదాల నడుమే సాగుతున్నాయి. గత ఏడాది మార్చిలో యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న ఎన్నికలను కరోనా వైరస్‌ను కారణంగా చూపుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వాయిదా వేసిన తర్వాత.. తిరిగి ఎన్నికలు ప్రారంభం, నిర్వహణ, పూర్తి కావడం.. ఇలా ప్రతి దశలోనూ వివాదాలు నెలకొంటున్నాయి. పంచాయతీ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్.. ఏ ఎన్నికలైనా సాఫీగా జరగడం లేదు. వివాదం లేకుండా ఎన్నికలు జరిగితే బాగుండదని భావిస్తున్నారో ఏమో గానీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహరించుస్తున్న తీరుతో ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కూడా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీసుకున్న నిర్ణయంతో సంకట స్థితిలో పడ్డాయి. ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే సందేహాలు మొదలవుతున్నాయి. బెదిరింపుల వల్ల నామినేషన్లు వేయని వారు, నామినేషన్లు ఉపసంహరించుకున్న వారికి మరోసారి నామినేషన్ దాఖలుకు అవకాశం ఇస్తామని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రకటించారు. అభ్యర్థుల నుంచి కలెక్టర్లు ఫిర్యాదులు తీసుకున్నారు. కలెక్టర్ల నుంచి నివేదికలు తీసుకున్న తర్వాత.. నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చే విషయంపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల ఏర్పాట్లపై తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో నిమ్మగడ్డ పేర్కొన్నారు.
నిమ్మగడ్డ చేసిన ప్రకటనతోనే మున్సిపల్ ఎన్నికలు సకాలంలో జరుగుతాయా..? లేదా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆగిపోయిన చోట నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు గత నెలలో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. గత మార్చిలో నామినేషన్ల పరిశీలన వరకూ ప్రక్రియ సాగింది. ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నెల 2వ తేదీ నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభమై 3వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటల వరకు కొనసాగేలా షెడ్యూల్‌లో పేర్కొంది. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. 10వ తేదీన పోలింగ్, అవసరమైన చోట 13వ తేదీన రీ పోలింగ్, 14వ తేదీన కౌటింగ్, ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఒకే దఫాలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 12 కార్పొరేషన్లు, 75 పురపాలక, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. బెదిరింపుల వల్ల నామినేషన్లు వేయని, వేసినా ఉపసంహరించుకున్న వారికి మళ్లీ అవకాశం ఇస్తే.. ఆ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం అవుతుంది..? ఎప్పుడు లోపు పూర్తవుతుంది..? సోమవారం మధ్యాహ్నం వరకూ ఈ విషయంపై ఎస్‌ఈసీ ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. అవకాశం ఇవ్వడమో, ఇవ్వకపోడమో.. ఏదో ఒక విషయం చెప్పాల్సిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. చివరి నిమిషం వరకూ నాన్చివేత ధోరణిలో ఉంటున్నారు. ఆఖరి నిమిషంలో మళ్లీ నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇస్తున్నామని చెబితే.. అభ్యర్థులు లేదా ఇతరులు కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుంది. కోర్టులు వారి పిటిషన్లను విచారణకు స్వీకరిస్తే.. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా ప్రభుత్వ పాలనకు ఆటంకాలు ఎదురవుతాయి. రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు సమయం వృథా కావడంతోపాటు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. మరి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మనసులో ఏముందో..? లక్ష్యం ఏమిటో..?.