iDreamPost
android-app
ios-app

నేడే పరిషత్‌ పోరు

నేడే పరిషత్‌ పోరు

ఏపీలో పరిషత్‌ పోరు నేడే జరగనుంది. బుధవారం మధ్యాహ్నం డివిజన్‌ బెంచ్‌ సదరు స్టే ఉత్తర్వులను ఎత్తివేయడంతో పరిషత్‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. వెంటనే సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం గత ఏడాది మార్చి 7న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అదే నెల 14న రిటర్నింగ్‌ అధికారులు అభ్యర్థుల తుది జాబితాలను ప్రకటించారు. కొవిడ్‌ ఉధృతి కారణంగా ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అదే నెల 15న ఎన్నికల ప్రక్రియను వాయిదావేశారు.

ఏప్రిల్‌ 1న కొత్తగా ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన మాజీ సీఎస్‌ నీలం సాహ్ని అదే రోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తిరిగి ప్రారంభిస్తూ.. 8న పోలింగ్‌, 10న కౌంటింగ్‌ నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 652 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీలకు గురువారం పోలింగ్‌ జరుగనుంది. 13 జిల్లాల్లో 2,46,71,002 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నిజానికి 660 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 126 అధికార పార్టీకి ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 8 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. నిరుడు మార్చి నుంచి ఇప్పటి వరకు.. పోటీలో ఉన్న వివిధ పార్టీల తరఫు అభ్యర్థులు 11 మంది మరణించారు. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది పోటీలో ఉన్నారు. అదే విధంగా 10,047 ఎంపీటీసీలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 375 స్థానాలకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదు. 81 మంది అభ్యర్థులు మరణించడంతో మిగిలిన 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 18,782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు అవసరమైన మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్లు, థర్మల్‌ స్కానర్లు, హ్యాండ్‌ గ్లోవ్స్‌లను అవసరమైన సంఖ్యలో పోలింగ్‌ స్టేషన్ల వారీగా సిద్ధం చేశారు. ఆ పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఎవరైనా కొవిడ్‌ పాజిటివ్‌ బాధితులు ఉంటే.. వారికి అవసరమైన పీపీఈ కిట్లు కూడా ఏర్పాటు చేశారు. వారు పోలింగ్‌ చివరి గంటలో వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. పోలింగ్‌ సిబ్బంది అందరికీ కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన రక్షణ చర్యలు, మహిళా సిబ్బందికి తగిన వసతులను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సిబ్బందికి పంపిణీ కేంద్రాల్లో, పోలింగ్‌ స్టేషన్లలో అల్పాహార, భోజన వసతి ఏర్పాటుచేశామని అధికారులు తెలిపారు. పోలింగ్‌ సమయంలో అవాంఛనీయ సంఘటనలు నివారించేందుకు పోలీసు సహకారంతో తగు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వెబ్‌కాస్టింగ్‌ కోసం 3,538 మందిని నియమించారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే కాల్‌ సెంటర్‌కు టోల్‌ఫ్రీ నంబర్‌ 0866 2466877కు కాల్‌ చేయాలని అధికారులు తెలిపారు.