ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా సాగుతోంది. తొలి దశకు మించి రెండో దశలో ప్రభావం కనిపిస్తోంది. మొదటి దశలో ఏకగ్రీవాల విషయంలో ఎస్ఈసీ కొంత బెట్టు చేసింది. ముఖ్యంగా చిత్తూరు గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవ పంచాయితీల సంఖ్య ప్రకటించడానికి తొలుత అంగీకరించలేదు. చివరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేరుగా గవర్నర్ తో భేటీ అయిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు ఆ రెండు జిల్లాల ఏకగ్రీవాలను కూడా ఆమోదిస్తూ ప్రకటన వెలువడింది. ఆ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ప్రకటనలు ఎస్ఈసీకి ఆగ్రహాన్ని రప్పించాయి. దాంతో పెద్దిరెడ్డి ని గృహనిర్బంధించాలని కూడా ఆదేశాలిచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఏపీ హైకోర్టు మాత్రం ఆ ఆదేశాలను తోసిపుచ్చింది.
కాగా తాజాగా రెండో దశ ఏకగ్రీవాలను ఎస్ఈసీ చేసిన అధికార ప్రకటన ప్రకారమే గతం కన్నా మించి ఉండడం విశేషం. పైగా 2013తో పోలిస్తే ఈసారి ఏకగ్రీవాల సంఖ్య భారీగా ఉంటుందని చెప్పవచ్చు. ఏపీలోని 13 జిల్లాల పరిధిలో గత ఎన్నికల్లో కేవలం 1820 గ్రామ పంచాయితీలు మాత్రమే ఏకగ్రీవం కాగా ఈసారి దానికి మించి ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఈ వ్యవహారం రుచించినా లేకపోయినా పలు గ్రామాల్లో ప్రజలు ఏకగ్రీవాలకు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. పైగా ప్రభుత్వం కూడా భారీ నజారానా ప్రకటించడంతో ఈసారి కొన్ని మేజర్ పంచాయితీల్లో కూడా ఏకగ్రీవాలకు సిద్ధపడుతున్నారు. విపక్షాలకు తగిన అభ్యర్థులు లేకపోవడంతో అనేక చోట్ల వైసీపీలోనే వివిధ వర్గాలు పోటీపడుతుండగా, అందరినీ సఖ్యంగా నిలబెట్టిన నేతలున్న చోట ఏకగ్రీవాలకు అవకాశం ఏర్పడుతుంది.
కాగా రెండో దశ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ పంచాయితీ ఎన్నికలు రెండో దశలో మొత్తం ఎన్నికలు 3328 పంచాయితీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 13 జిల్లాల్లో 167 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే వాటిలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 539 పంచాయితీలు ఏకగ్రీవాలయ్యాయి. దాంతో ఇది మొదటి దశ కంటే మరో 12 సీట్లు అదనం కావడం విశేషం. రాబోయే మూడు, నాలుగు దశల్లో ఏకగ్రీవాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
జిల్లాల వారీగా..
గుంటూరు- 70
ప్రకాశం – 69
విజయనగరం -60
కర్నూలు -57
నెల్లూరు -35
చిత్తూరు-65
శ్రీకాకుళం- 41
కడప- 40
విశాఖ-22
కృష్ణా -36
తూగో -17
పగో -15
అనంతపురం-15
మిగిలిన 2786 గ్రామ పంచాయితీలకు ఈనెల 13న పోలింగ్ జరుగుతుంది. 7,510 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు
33570 వార్డులకు గానూఊ 12605 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.
కాగా ఏకగ్రీవరం అయిన వాటిలో 95 శాతం పైగా వైఎస్సార్సీపీ అభ్యర్థులే కావడం గమనార్హం. పల్లెల్లో అధికార పార్టీ మరోసారి పట్టు సాధించినట్టవుతోంది.