iDreamPost
android-app
ios-app

ప్రజల్ని దూరం చేసేయాలి.. సింగిల్‌ పాయింట్‌ ఎజెండా

  • Published Sep 25, 2020 | 2:08 AM Updated Updated Sep 25, 2020 | 2:08 AM
ప్రజల్ని దూరం చేసేయాలి.. సింగిల్‌ పాయింట్‌ ఎజెండా

రాష్ట్ర జనాభాపై కోవిడ్‌ 19 ప్రభావం.. ప్రపంచ వ్యాప్తంగా ముంచుకువస్తున్న ఆర్దిక మాంద్యం, గత పాలనలో రాష్ట్రంలో జరిగిన అవకతవకలు.. ప్రస్తుతం ఎదురవుతున్న వ్యవస్థాగతమైన ఇబ్బందులను అధిగమించేందుకు బాధ్యతాయుతంగా సూచనలు ఇవ్వడం.. ఇటువంటివేమీ ప్రస్తుతం ఏపీలోని ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన ఎజెండాలుగా లేవన్నది ప్రజల వైపు నుంచి విన్పిస్తున్న మాట. అంతా ఏకమై పెట్టుకున్న సింగిల్‌ పాయింట్‌ ఎజెండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ను ప్రజలకు దూరం చేసేయ్యాలన్నదేనన్నది వారి లోతైన భావన అన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.

నిజానికి జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఎవ్వరికైనా ఇదే బోధపడక మానదు. గత పదిహేను నెలల పాలనను ఓ సారి పరిశీలిస్తే.. పాలనలో నిలదొక్కుకోవడానికి ఆరేడు నెలలు, ఆ తరువాత కోవిడ్‌ ముంచుకొచ్చి ఏడు నెలలు కాలగర్భంలో కలిసిపోయాయి. అంటే సీయంగా బాధ్యలు చేపట్టాక నేరుగా పాలనపై దృష్టిపెట్టేటంతటి అవకాశం జగన్‌ బృందానికి లేకుండానే పోయింది.

అయినప్పటికీ ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేసాడు. దాదాపు యాభైవేల కోట్ల రూపాయలను వివిధ సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందజేసారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యుత్తమంగా కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు వైద్యరంగాన్ని సంసిద్ధం చేయగలిగారు. ఇవన్నీ ఒకెత్తయితే దాదాపు నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టించి, ఎక్కడి వారికక్కడే ఉద్యోగం చేసుకునే వెసులుబాటును కల్పించడం కూడా జరిగింది. అయితే వీటిలో సాంకేతికంగా ఉన్న లోపాలను పక్కన బెడితే సామాజికపరంగా విస్తృతమైన ప్రయోజనాలే ఉన్నాయన్నది పలువురు నిపుణులు కూడా ఒప్పుకుంటున్న వాస్తవం.

జగన్‌ సిద్ధం చేసిన ఇళ్ళస్థలాల పంపిణీ లాంటి వాటిని కోర్టు కేసుల పేరుతో అడ్డుకోగలిగారు తప్పితే, కాకుండా అయితే చేయ్యలేరన్నది ఇప్పటికే జనానికి అర్ధమైపోయింది. ఇప్పుడు కాకపోతే వచ్చేనెల, ఇంకా పోతే ఆ పైనెలలోనైనా తమ స్థలం తమకు పువ్వుల్లో పెట్టి ఇస్తాడంటూ జగన్‌పై మరింత నమ్మకాన్ని చూపించడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం.

అయితే ప్రతిపక్ష పార్టీలకు మాత్రం ఇవేమీ కన్పించడం లేదు. ఇంత కంటే మెరుగ్గా చేసేందుకు సూచనలు, సలహాలు ఇద్దామన్న ధ్యాస, స్పృహ కూడా కరువైనట్టుగా కన్పిస్తోంది. వీళ్ళ కళ్ళకు అర్జునుడికి పిట్ట కళ్ళు మాత్రమే కన్పించినంత తీక్షణంగా జగన్‌ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే కన్పిస్తోంది. దీంతో సరిగ్గా అక్కడే తమ లక్ష్యాన్ని సిద్ధం చేసుకున్నారన్నది అధికార పార్టీవారు ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతొ ప్రజల్లో జగన్‌ను పలుచన చేసేందుకు సంయుక్తంగా ప్రణాళికలు వేసుకుంటున్నారంటున్నారు. అందులో భాగంగానే మతం, విధ్వంసం తదితర కాన్సెప్టులు తెరపైకి వస్తున్నాయన్నదానిపై ప్రజలు పక్కా క్లారిటీనే ఉన్నారని ఢంకాభజాయించి చెబుతున్నారు. జనంలో ఉన్న జగన్‌ను అభాసుపాలు చేద్దామనుకుంటే.. ఆ ప్రయత్నం చేసేవారే అభాసుపాలవుతారని స్పష్టం చేస్తున్నారు.

అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఒకటుంది. నన్ను కాపాడుకోండి.. నేను బాగుంటేనే మీరు బాగుంటారు.. అంటు గతంలో ఓ పెద్దాయని అడిగినట్టు ఇక్కడ జగన్‌ అడగడం లేదు. జస్ట్‌ తనపని తాను చేసుకుంటూ ముందుకెళుతున్నాడు. తద్వారా ప్రజలకు తన అవసరాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ప్రజలే తనకు అండగా ఉంటారన్న కొండంత నమ్మకాన్ని మనస్సులోనే పెట్టుకుని తనదైన సంక్షేమ పాలనను కొనసాగిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షాలు తమ బాధ్యతను ఎంత వరకు సక్రమంగా నెరవేరుస్తాయో వేచి చూడాల్సిందే.