వైసీపీ మేనిఫెస్టోలో ఓ ఆసక్తికర హామీ దశాలవారీ మద్యపాన నిషేధం . గ్రామీణ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసి ఎన్నో కుటుంబాల దుస్థితికి కారణమవుతున్న మద్యాన్ని దశలవారీగా సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసి నిషేదిస్తానని హామీ ఇచ్చిన జగన్ దాన్ని నెరవేర్చగలడా ?
1990 నుండి రాజకీయాలు ఫాలో అయ్యేవారికి అప్పటి మద్యపాన నిషేధ ఉద్యమం , దూబగుంట రోశమ్మ పోరాటం , కోట్ల గారు సంపూర్ణ నిషేధం సాధ్యం కాదని ప్రభుత్వ సారా వరకు నిషేదించటం , ఈనాడు టీడీపీకి అనుకూలంగా సాగించిన వ్యూహాత్మక పోరాటం తర్వాత 94 లో ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే మధ్యపానాన్ని నిషేధించడం గుర్తుండే ఉంటుంది .
ఆ తర్వాత నాటుసారా , గుడుంబా వంటివి ఏరులై పారడం , దాదాపు 26 మంది అక్రమ మద్యం వ్యాపారులు , సీఎం రమేష్ లాంటి నాటు సారా తయారీదారులు సిండికేట్ గా ఏర్పడి విచ్చలవిడిగా అమ్మకాలు సాగించడం ఆ సిండికేట్ వెనక బాబుగారు ఉన్నారని కొన్ని పత్రికల్లో పతాక శీర్షికగా వార్తలు రావడం తర్వాత బాబు గారు ఎన్టీఆర్ ని గద్దె దించి తాను ముఖ్యమంత్రి అయ్యాక మరింత విజృంభించిన అక్రమ మద్యం , నాటుసారా కారణంగా నిషేధం అమలు చేయలేకపోతున్నామని 1997 లో నిషేధాన్ని ఎత్తేసి ప్రభుత్వ మద్యానికి గేట్లెత్తడం అందరికీ తెలిసిన విషయమే .
ఆ తర్వాత కాలంలో దురదృష్టవశాత్తు పెరిగిన పాశ్చాత్య సంస్కృతి కానీ , ఆధునిక పోకడలు కానీ , ప్రభుత్వాలు మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా పరిగణించి టార్గెట్లు పెట్టి అమ్మించటం వలన కానీ మద్యం దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి . వాటితో పాటే బాబు గారి హయాంలోనే 98 లలో పుట్టుకొచ్చిన ఓ సరికొత్త సంస్కృతి బెల్ట్ షాప్స్ .
పట్టణాల్లో ,మండల కేంద్రాల్లో ఉండే మద్యం షాప్స్ కి అనుబంధంగా ప్రతి పల్లెలో పురుడు పోసుకున్న రాక్షస సంతానమే ఈ బెల్ట్ షాప్స్ . మద్యం తాగాలనుకొనే వాడు ఓ పట్టణానికో , పెద్ద పల్లెటూరికో వెళ్లకుండా మొదటగా తన ఊరిలోనే బెల్ట్ షాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన మద్యం తర్వాత తన ఇంటికి దగ్గరలోనే అదే వీధిలో దొరికే స్థాయికి బెల్ట్ షాప్స్ విస్తరించాయి . ఒక్కో గ్రామంలో నాలుగు నుండి ఆరు వరకూ బెల్ట్ షాప్స్ ఉండేవంటే మద్యం మహమ్మారి గ్రామాల్ని ఏ స్థాయిలో కమ్ముకొందో అర్థం చేసుకోవచ్చు . గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 44000 బెల్ట్ షాప్స్ ఉన్నాయని ఒక అంచనా.
ఈ అనధికార బెల్ట్ షాప్స్ కి ఏ చట్టమూ లేదు , ఏ పన్నూ ఉండదు , ఇవన్నీ అక్రమ దుకాణాలే కానీ ఏ వ్యవస్థ కూడా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు . వీటిని నడిపేది అధికారంలో ఉన్న ఆయా పార్టీల గ్రామ నాయకుల తాలూకు అనుచరగణం అన్నది బహిరంగ రహస్యం . ఈ బెల్ట్ షాప్స్ లో అదనపు ఆదాయం కోసం చేసే కల్తీ వల్ల కిడ్నీ , లివర్లు పాడై వళ్ళు గుల్ల చేసుకొని జీవఛ్చవాలుగా మిగిలిన వాళ్ళు కోకొల్లలు ,తాళి తెగి రోడ్డున పడ్డ ఆడబిడ్డలు ఎందరో .
ఓ పాతికేళ్ల క్రితం పల్లెటూరి జనాల్లో (పురుషుల్లో) మద్యం తాగేవారు ఓ పది పదిహేను శాతం ఉండేవారేమో . వాళ్ళని ఓ రకమైన చులకన భావంతో చూసేవారు మిగతా జనాలు . కానీ నేడు దాదాపు ప్రతి ఇంటికో వ్యసనపరుణ్ణి తయారు చేశాయి ఈ బెల్ట్ షాప్స్ .రోజువారీ ఆహారంలా మద్యం కూడా ఓ నిత్యావసర సరుకుగా మారిపోయింది .
అదో వ్యసనంలా చూడటం మానేసి సాధారణ విషయంగా పరిగణించే స్థాయికి ఎదిగింది మద్యం మహమ్మారి . కుటుంబ ఆదాయంలో అగ్ర భాగాన్ని కొల్లగొట్టి ఇల్లూ వళ్ళూ గుల్ల చేస్తున్న ఈ మద్యం దుష్ప్రభావాన్ని తన పాదయాత్రలో గమనించి మహిళల ఆకాంక్షకి అనుగుణంగా మద్యపాన నిషేదంచేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇది అమలు చేయగలడా అంటే ఆచరిస్తున్న విధానాన్ని చూస్తే సాధ్యమే అని చెప్పొచ్చు .
గతంలో ఒకేసారి మద్యనిషేధం చేస్తే పరిస్థితి అదుపు తప్పుతుందన్న కోట్ల గారి మాట వినకుండా, అత్యుత్సాహంతో టీడీపీ విధించిన సంపూర్ణ మద్యపాన నిషేధం ఆ పార్టీ నేతల చేతలతోనే అక్రమ మద్యం , నాటుసారాతో నీరు గారిన వైనం మళ్లీ నిషేధం ఎత్తేయటం లాంటి అంశాలు పరిశీలించిన జగన్ ఒకేసారి ఎత్తేయకుండా క్రమ క్రమంగా నిషేదించే బాటలో ప్రయాణించడం సత్పలితాలనే ఇస్తుందని చెప్పొచ్చు .
ఈ చర్యలో మొదటి దశగా బెల్ట్ షాప్స్ మూత వేయించడం మరలా ఎవరూ అమ్మకుండా కనిపెట్టి ప్రభుత్వానికి సమాచారం అందించే బాధ్యతను గ్రామానికి పది మంది ఉన్న వాలంటీర్లకు అప్పచెప్పి నిరంతర నిఘాతో వాటికి అడ్డుకట్ట వేసిన తీరు మెచ్చుకోతగ్గది .
ఇహ రెండో దశలో 2019 సెప్టెంబర్ వరకూ 4380 ఉన్న మద్యం దుకాణాలను 3500 లకు కుదించి వాటిని ప్రభుత్వమే నిర్వహించే బాధ్యత తీసుకోవడం సాహసోపేతమైన చర్య . ప్రభుత్వానికి అప్పులు తప్ప ఆదాయం లేని స్థితిలో , ప్రధాన ఆదాయాన్ని కోల్పోటానికి సిద్ధపడడం , పదేళ్ల తర్వాత దక్కిన అధికారంతో లిక్కర్ బిజినెస్ చేజిక్కించుకొని సంపాదించుకొందాం అని ఆశించిన బలమైన సొంత పార్టీ నేతల , మండల , గ్రామీణ ద్వితీయ శ్రేణి నాయకుల ఆశల్ని ఆడియాసలు చేస్తూ అమలు చేసిన ఈ నిర్ణయం మద్యనిషేదం పట్ల జగన్ స్థిరసంకల్పాన్ని సూచిస్తుంది .
ఈ దుకాణాల్ని ప్రభుత్వమే నిర్వహించటం వలన పల్లెల్లో దొంగచాటుగా అయినా బెల్ట్ షాప్ నిర్వహిద్దామనుకొనే వారికి మద్యం లభ్యం కాదు .
అలాగే గతంలో ఉదయం ఆరు నుండి రాత్రి ఒంటిగంట వరకూ విచ్చలవిడిగా సాగిన అమ్మకాలు ఆగిపోయి ఉదయం పది నుండి రాత్రి ఎనిమిది వరకూ నియమిత వేళల్లో అమ్మకాలు సాగించడం , తాగడానికి అక్కడ పర్మిట్ రూమ్స్ లేకపోవడం వలన ఇన్నాళ్లూ నానా చికాకులు అనుభవించిన మద్యం షాపుల చుట్టుపక్కల ప్రజలు మనఃశాంతిగా జీవించడానికి దోహదం చేసింది .
అలాగే గ్రామాల్లో బెల్ట్ షాప్స్ అందుబాటులో లేక , రోజూ ఐదు పది కిలోమీటర్లు ప్రయాణం చేసి అధిక ధరలకు తాగటం గ్రామాల్లోని తాగుబోతులకు కొన్నాళ్ళు సాధ్యమైనా తర్వాత తర్వాత నిదానంగా తగ్గించేస్తారు అన్నది నిర్వివాదాంశం .
తదుపరి చర్య బార్ అండ్ రెస్టారెంట్లు సంఖ్య తగ్గించడం , నిన్న నూతన బార్ల విధానంపై జరిగిన సమీక్షలో ప్రస్తుతం 797 ఉన్న బార్లని 40 శాతం అంటే 319 రద్దు చేసి 478 బార్లకి మాత్రమే అది కూడా పర్మిట్ ధరలు భారీగా పెంచి వివాదాలకు తావు లేకుండా లాటరీ పద్దతిలో కేటాయించాలని నిర్ణయించడం , ఉదయం పదకొండు నుండి రాత్రి పదిగంటల వరకే మద్యం సరఫరా చేయాలని ఆదేశించడం మద్యం మహమ్మారి నుండి ప్రజల్ని దూరం చేయాలన్న సంకల్పానికి ప్రతీకలుగా చెప్పొచ్చు .
జనవరి ఒకటి నుండి అమలు కానున్న కొత్త బార్ పాలసీకి సంభందించి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు , దరఖాస్తు పీజు 2 నుండి పది లక్షలకు పెంచారు , సంవత్సర లైసెన్స్ ఫీజులని 50 వేల జనాభా ఉన్న పట్టణానికి 25 లక్షలు , 5 లక్షల లోపు ఉన్న పట్టణానికి 50 లక్షలు , 5 లక్షలు పై బడి ఉన్న ప్రాంతాల్లో 75 లక్షలు , సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే త్రీ స్టార్ , ఫైవ్ స్టార్ హోటల్స్ , మైక్రో బ్రూవరీలకు కోటిన్నర గా నిర్ణయించారు . ఈ రేట్లు చూస్తే బార్ దరఖాస్తు దారులకు కళ్ళు భైర్లుకమ్మడం ఖాయం . అలాగే మద్యం పై కూడా దేశీ విదేశీ కేటగిరులను బట్టి సగటున 60 ml పై రూ 30 నుండి 60 రూపాయల వరకూ పెంచడం మద్యం ప్రియులకు గుటక పడని అంశం కానుంది .
ఇహ మద్యం స్మగ్లింగ్ , కల్తీ , నాటు సారా తయారీ వంటి అక్రమాల పై కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టె యోచన చేయడం కూడా అక్రమార్కులకు కళ్లెం వెయ్యనుంది . ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయడం ద్వారా పట్టణాల్లో కూడా కట్టడి చేస్తూ దశల వారీ నిషేధాన్ని అమలు చేసి గుజరాత్ తరహాలో స్టార్ హోటల్స్ స్థాయిలో మాత్రమే అదీ లిమిటెడ్ గా అందుబాటులో ఉండేట్టు చేసి పేదలను మద్యం మహమ్మారి నుండి దూరం చేస్తానన్న జగన్ గారి హామీ ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పచ్చు .
మద్యం వ్యసనానికి బానిసలైన వ్యక్తులతో కునారిల్లుతున్న గ్రామీణం నుండి దురలవాట్లు లేని మెరుగైన ఆయుఃప్రమాణాలతో ఉన్నత జీవనం గడిపే పల్లెసీమల్ని త్వరలోనే జగన్ గారి ద్వారా చూడటం సాధ్యమే అనిపించక మానదు . అలాగే పదవ తరగతి పాసైన వెంటనే పార్టీలు అంటూ మద్యపాన వ్యసనం వైపు పరుగులు తీస్తున్న పట్టణ యువతని సైతం కట్టడి చేసి సరైన దారిలో పెట్టే నిర్ణయాలతో ముందుకు పోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఖచ్చితంగా అభినందనీయుడే . ఈ అంశాలు కార్యాచరణకు వచ్చి మద్యం నియంత్రిపబడిన నాడు నా అక్క చెల్లెలు అని సంభోదించే మహిళల మనసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుస్థిర స్థానం సంపాదించుకొంటాడు అని చెప్పటం అతిశయోక్తి కాదేమో .