iDreamPost
android-app
ios-app

కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీనే దేశంలో టాప్..

కరోనా నియంత్రణ చర్యల్లో ఏపీనే దేశంలో టాప్..

జగన్ ప్రభుత్వం సరికొత్త రికార్డ్ సృష్టించింది. కరోనా నియంత్రణ చర్యలు మరియు టెస్టుల నిర్వహణలో దేశంలో టాప్ ర్యాంక్ సాధించింది. ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ సదుపాయాలు, జనాభా, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ కంటే వెనుకబడ్డాయి.

ముఖ్యంగా టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌ వ్యూహంతో ముందుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఆ దిశగా పూర్తి విజయం సాధించిందనే చెప్పవచ్చు. కరోనా వైరస్ బయటపడినప్పుడు ఒక్క ల్యాబ్ కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదు. కానీ జగన్ ప్రభుత్వం కరోనా పరీక్షల నిర్వహణలో వెనుకడుగు వేయలేదు. ల్యాబ్ లు ఏర్పాటు చేసి టెస్టుల సంఖ్యను పెంచుకుంటూ పోయింది. మొదట్లో పది లక్షల మందిలో 10వేల మందికి టెస్టులు చేయడానికి 133 రోజులు పట్టింది. కానీ నేడు మాత్రం పది లక్షల మందిలో 1,00,718 మందికి కోవిడ్‌ టెస్టులు జరుగుతుండడం గమనార్హం.

దేశంలో జరుగుతున్న ప్రతి 100 టెస్టుల్లో ఎనిమిది టెస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే జరగడం విశేషం. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి అందరికీ వైద్యం అందేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా అభినందనలు పొందింది. కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అందరి మన్ననలు పొందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా కరోనా సోకినవారితో పోలిస్తే పూర్తి ఆరోగ్యంతో బయటపడిన వారి సంఖ్య ఎక్కువ ఉండటం గమనించాల్సిన విషయం..

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,54,385 మంది కరోనా బారిన పడగా 5,79,474 మంది కరోనా నుండి కోలుకున్నారు. 5,558 మంది మృత్యువాత పడ్డారు.గురువారం 7855 మందికి కరోనా సోకగా 8807 మంది కోలుకోవడం విశేషం.. ప్రస్తుతం రాష్ట్రంలో69,353 ఆక్టీవ్ కేసులు ఉన్నాయి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడిలో దేశంలోనే టాప్ ప్లేసులో నిలవడంతో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై అనేక రాష్ట్రాలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి.