ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఏపీ ఎస్‌ఈసీ) కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీరును ఏపీ హైకోర్టు దుయ్యబట్టింది. ప్రభుత్వంపై దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహరించిన తీరుపై తీవ్రంగా ఆక్షేపించింది. పబ్లిసిటీ కోసం ఎస్‌ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి ప్రతివాదులపై ఒత్తిడి చేస్తున్నట్లుగా ఉందని నిమ్మగడ్డ తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది.
అసలు ఏం జరిగింది..?
పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సహచరించడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ అప్పటి ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదిని ప్రతివాదులుగా చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసినట్లు మరుసటి రోజు పత్రికల్లో పతాక శీర్షికల్లో ప్రచురితమైంది. అయితే ఆ తర్వాత పిటిషన్ గురించి నిమ్మగడ్డ పట్టించుకోలేదు. విచారణ ఎప్పుడు వస్తుందనే అంశంపై ఆరా తీయలేదు.
ఇన్నాళ్లు ఏం చేస్తున్నారు..?
ఎస్‌ఈసీ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఎప్పుడో డిసెంబర్ 18వ తేదీన దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు విచారణకు రావడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పిటిషన్‌పై విచారణ ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ విచారణకు రాకపోతే ఇన్నాళ్లు ఏం చేస్తున్నారని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ న్యాయవాదులను ప్రశ్నించింది. రిజిస్ట్రార్‌ను కలసి పిటిషన్‌పై వినతిపత్రం ఇవ్వాల్సిన పనిలేదా..? అంటూ నిలదీసింది. డిసెంబర్ 18వ తేదీన పిటిషన్ దాఖలు చేస్తే.. 19వ తేదీన మీడియాలో కూడా వచ్చిందని గుర్తు చేసింది. అయినా పిటిషన్‌పై ఎస్‌ఈసీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆక్షేపించించింది. పబ్లిసిటీ కోసమే ప్రభుత్వంపై ఎస్‌ఈసీ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రతివాదులపై ఎస్‌ఈసీ ఒత్తిడి చేస్తున్నట్లుగా ఉందని హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఇకపై ఏ పిటిషన్ దాఖలు చేసినా.. మీడియాకు సమాచారం ఇవ్వొద్దని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ న్యాయవాదులను ఆదేశించింది.
కౌంటర్ దాఖలుకు ఆదేశాలు..
కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రతివాదులైన పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, అప్పటి సీఎస్ నీలం సాహ్ని, ప్రస్తుత సీఎస్ ఆధిత్యానాథ్ దాస్‌లు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.
15416