iDreamPost
android-app
ios-app

కొల్లు బెయిల్‌ ఆశ కూడా ఆవిరైంది..!

కొల్లు బెయిల్‌ ఆశ కూడా ఆవిరైంది..!

వివిధ కేసుల్లో అరెస్ట్‌ అయిన జైలు జీవితం గడుపుతున్న టీడీపీ తాజా, మాజీ ప్రజా ప్రతినిధులకు ఆయా కేసుల నుంచి ఏ మాత్రం ఊరట లభించడంలేదు. రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నా కోర్టుల్లో ఉపశమనం దక్కడంలేదు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెం నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిలకు మాదిరిగానే మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టులో చుక్కెదురైంది. మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడి హత్య కేసులో నిందితుడుగా ఉన్న కొల్లు రవీంద్ర ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

మంత్రి నాని ముఖ్య అనుచరుడి హత్య కేసులో తమ నుంచి తప్పించుకుని పారిపోయిన కొల్లు రవీంద్రను పోలీసులు సినీ పక్కిలో అరెస్ట్‌ చేసి కోర్టు ముందు నిలిపారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో ఈ నెల 4వ తేదీ నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. 14 రోజుల రిమాండ్‌ ముగియడంతో మరోమారు మచిలీపట్నం కోర్టు ఆ గడువును పొడిగించింది. మోకా భాస్కర రావు హత్య కేసులో సూత్రధారి కొల్లు రవీంద్రేనని పోలీసులు పక్కా ఆధారాలు సేకరించడంతో ఈ మాజీ మంత్రి బుక్కయ్యారు. విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేసిన వెంటనే.. తన ఇంటి వెనుక గోడ దూకి పరారయ్యారు. విశాఖపట్నం వెళుతుండగా తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలో మఫ్టిలోని పోలీసులు కొల్లును అరెస్ట్‌ చేశారు.

తమ పార్టీ నేతలపై రాజకీయ కక్షతో కేసులు పెట్టారంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నా.. సాక్ష్యాలు, ఆధారాలు మాత్రమే పరిగణలోకి తీసుకునే న్యాయస్థానాల్లో వారికి శృంగభంగం తప్పడంలేదు. నిన్న బుధవారం ఒకే రోజు ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ అయిన అచ్చెం నాయుడు బెయిల్‌ తిరస్కరణ కావడంతోపాటు.. బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌ 4గా మార్చి విక్రయించిన కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డికి కూడా తీవ్ర ఆశాభంగం ఎదురైంది. ఇది జరిగి 24 గంటల్లోనే కొల్లు రవీంద్ర బెయిల్‌ పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టివేయడం టీడీపీ శ్రేణులకు మింగుడుపడడంలేదు.